
Chidambaram On GST Reforms: కేంద్రం తాజాగా తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల్ని సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ పి.చిదంబరం స్వాగతించారు. అయితే, ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉండేదన్నారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. లోపాలను సరిదిద్దడానికి కేంద్రానికి ఎందుకు 8 సంవత్సరాలు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ప్రస్తుత GST రూపకల్పనలో చాలా లోపాలున్నాయని ప్రతిపక్షాలు చాలా సంవత్సరాలుగా హెచ్చరిస్తూ వచ్చాయని.. అయినా కేంద్రం వారి విన్నపాలను విస్మరించిందన్నారు. వివిధ వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు మంచిదని చెప్పిన చిదంబరం.. ఈ సంస్కరణలు తెచ్చేందుకు ఇంతకాలం ఎందుకు పట్టిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ కారణాల వల్లే అకస్మాత్తుగా జీఎస్టీలో ఈ మార్పులు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.
బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..
జీఎస్టీ సుంకాల తగ్గింపు అనేది ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేశారని చిదంబరం ఆరోపించారు. దేశంలో వృద్ధి మందగించడం, ప్రజల రుణభారం పెరిగి, పొదుపు తగ్గడం వంటి అంశాలు కూడా కేంద్ర చర్యలకు కారణమన్నారు. అటు, TMC కూడా జీఎస్టీ తగ్గింపుపై స్పందించింది. GST రేటు తగ్గింపును ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి ద్వారా సాధించిన సామాన్య ప్రజల విజయమని వెల్లడించింది. జీఎస్టీ విధానం బాగాలేదని TMC అధినేత్రి మమతా బెనర్జీ పలుమార్లు విమర్శించిందనే విషయాన్ని ఆ పార్టీ గుర్తు చేసింది.