
Wedding News: 1990వ దశకంలో ప్రేక్షకులను తెగ నవ్వించిన జంబలకిడిపంబ సినిమా గుర్తు లేని వారు ఉండరు. ఆ సినిమాలో మహిళలు పురుషుల్లా, పురుషులు మహిళల్లా ప్రవర్తించే అద్భుతమైన హాస్యకథనం అప్పట్లో తెలుగు సినీ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రయోగంగా నిలిచింది. ఈవీవీ సత్యనారాయణ తీసిన ఆ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సంచలనం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, సినిమాలో మాత్రమే కనిపించే ఆలా ఉండే పరిస్థితి ఇప్పుడు నిజ జీవితంలోనూ చోటుచేసుకుని అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.
వధువు వరుడిగా.. వరుడు వధువుగా రెడీ!
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం కొలుకులలో జరిగిన ఒక వివాహం అందరినీ ఆశ్చర్యపరిచింది. బత్తుల శివ గంగురాజు, నందినిల పెళ్లిలో వారి కుటుంబ ఆచారం ప్రకారం, వధువు వరుడిగా, వరుడు వధువుగా వస్త్రధారణ చేసుకున్నారు. విచిత్రమైన ఈ… pic.twitter.com/8geGzpqrJx
— ChotaNews App (@ChotaNewsApp) November 27, 2025
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని కొలుకుల గ్రామంలో జరిగిన ఒక వివాహం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ గ్రామానికి చెందిన బత్తుల కుటుంబంలోని శివగంగు రాజు, నందినిల పెళ్లి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. కారణం వారి పెళ్లిలో అనుసరించిన అరుదైన సంప్రదాయం. తరతరాలుగా వారి కుటుంబం పాటిస్తున్న ఆ ఆచారం ప్రకారం, పెళ్లి రోజున వధువు వరుడి పాత్రలోకి మారాలి, వరుడు వధువు వేషంలోకి వెళ్లాలి. అంటే, వధువు వరుడి దుస్తులు ధరించి వరుడిలా వ్యవహరిస్తే, వరుడు వధువు దుస్తులు ధరించి వధువులా ఉంటారు.
ఈ విచిత్ర సంప్రదాయం వెనుక గ్రామస్థుల నమ్మకం ఎంతో గాఢంగా ఉంటుంది. ఇలా చేస్తే పెళ్లి చేసుకున్న కొత్త జంట జీవితాంతం శుభం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు ఉంటాయని విశ్వసిస్తారు. గ్రామస్థుల మాటల్లో చెప్పాలంటే, ఇది వారి పూర్వీకుల నుంచి వస్తున్న ఒక పవిత్రమైన ఆచారం. దీనిని పాటించడం తమ కుటుంబాలకు అదృష్టాన్ని తీసుకొస్తుందని భావిస్తారు. అందుకే ప్రతి తరం ఈ సంప్రదాయాన్ని గౌరవంగా కొనసాగిస్తుంది.
వివాహ వేడుకలో వధువు వరుడిలా, వరుడు వధువులా మారిన దృశ్యాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచాయి. ఈ దంపతులను చూసిన వారంతా వారి దాంపత్యం నిండు నూరేళ్లు శాంతి, ఆనందాలతో కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు. గ్రామంలోని పెద్దలు కూడా ఈ సంప్రదాయం బత్తుల కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని గర్వంగా చెబుతున్నారు. ఇలా సినిమా కథల్లో కనిపించే ఒక సన్నివేశం నిజ జీవితంలో ఒక గ్రామానికి ప్రత్యేక గుర్తింపును ఇవ్వడం ఎంతో ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Health: అవునా.. నిజమా!.. అప్పుడప్పుడూ తినడం మానేస్తే ఆరోగ్యానికి మంచిదేనట..





