
Weather updates: తెలుగు రాష్ట్రాలకు సెన్యార్ తుపాను వల్ల ఎలాంటి ప్రమాదం లేదని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇండోనేషియా సమీపంలోని మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం సాయంత్రానికి సెన్యార్ అనే తుఫానుగా బలపడింది. పశ్చిమ దిశగా కదులుతూ ఇది ఇండోనేషియా తీరాన్ని తాకిన వెంటనే తీవ్ర గాలులు, భారీ వర్షాలు కురిపించింది. తుఫాను తీవ్రత ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగినా.. అనంతరం క్రమంగా బలహీనపడతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ తుఫాను దిశ మారి మలేషియా వైపు కదలడం ప్రారంభించడంతో భారత భూభాగంపై దీని నుండి ఎలాంటి ప్రభావం ఉండదని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇండోనేషియా తీరం దాటిన వెంటనే సెన్యార్ శక్తి పూర్తిగా తగ్గిపోతుందని కూడా అభిప్రాయపడ్డారు.
ఇక తెలుగు రాష్ట్రాలకు అసలు ప్రభావం చూపే వ్యవస్థ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనమని అధికారులు చెబుతున్నారు. శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం దశలవారీగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వాయుగుండం శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షాలకు ప్రధాన కారణం కానుందని తెలిపారు. ప్రత్యేకంగా శనివారం ఆదివారం రోజుల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ మార్పుల కారణంగా ఈ రోజు రాత్రికల్లా రెండు రాష్ట్రాల్లో మేఘాలు ఆవరించనున్నాయి. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో మేఘావరణం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణలో వర్షం పడే అవకాశం తక్కువగా ఉండగా, చలికూడా తగ్గుముఖం పడుతుందని అనుమానిస్తున్నారు. అయితే శనివారం నుండి మళ్లీ వర్షాలు ప్రారంభమై ఆదివారం వరకూ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద రాబోయే 2, 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం తీవ్రత పెరుగుతుందని స్పష్టమవుతోంది. ఈ వర్షాల పరిమాణం, ప్రభావం అన్నీ శ్రీలంక సమీపంలోని వాయుగుండం కదలికపైనే ఆధారపడి ఉంటాయని అధికారులు చెప్పారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
ALSO READ: Hong Kong: భారీ అగ్నిప్రమాదం.. 44 మంది మృతి.. 45 మందికి గాయాలు





