
Telugu States Weather Report: రుతుపవనాల ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు ఉత్తర బంగాళాఖాతం ఆనుకుని బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో మూడు రోజుల పాటు వానలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంత తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తం 19 జిల్లాల్లో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని ప్రకటించింది.
ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం
అటు ఏపీలోనూ మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు హెచ్చరికలు చేశారు. వర్షాలు పడే సమయంలో వేటకు వెళ్లకపోవడం మంచిదన్నారు. అవనసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. వర్షాలు తగ్గిన తర్వాతే వేటకు వెళ్లాలన్నారు.
Read Also: శ్రీశైలం ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద, త్వరలో గేట్లు ఓపెన్!