AP Weather Alert: ఏపీలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో శుక్రవారం తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, ఏజెన్సీ ప్రాంతాలు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం పది గంటల వరకు దట్టంగా మంచు కురిసింది. చలి తీవ్రత కొనసాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు
అటు రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరకోస్తాలో పొగమంచు కురుస్తుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
గుంటూరు వెదర్ మ్యాన్ ఏమన్నారంటే?
అటు గుంటూరు వెదర్ మ్యాన్ సోషల్ మీడియా వేదికగా వర్షాల గురించి కీలక ప్రకటన చేశాడు. జనవరి 23 సాయంత్రం నుంచి ఆకాశం మేఘవృతమై ఉంటుంది. 24,25,26 తేదీలలో తిరుపతి, నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైస్సార్, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ జల్లులు, వర్షాలు కురుస్తాయన్నాడు. గాలులు గంటకి 40 కిలో మీటర్ల వేగంతో వీయని తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు శ్రీలంక వైపు ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయన్నాడు. ఈ వర్షాలు ప్రభావం మరీ ఎక్కువగా ఉండదని గుంటూరు వెదర్ మ్యాన్ ప్రకటించాడు.





