
Srisailam Project: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా 2,71,570 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 2.84 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 3.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883 అడుగుల వరకు నీరు నిలువు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు 204.78 టీఎంసీలు నిలువ ఉంది.
సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయానికి 2,90,239 క్యూసెక్కులు వస్తుండగా 2,50,169 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 297 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో.. 26 గేట్లు ఐదు అడుగులెత్తి 1,96,742 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్ కేంద్రం ద్వారా 33,739 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.