
Warning: పిల్లల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశమున్న ఓ సిరప్ వినియోగంపై తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి కీలక హెచ్చరికలు జారీ చేసింది. చిన్నారుల కోసం వినియోగించే ఆల్మంట్ కిడ్ సిరప్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ డీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ సిరప్‌లో ప్రమాదకర రసాయనం ఉన్నట్లు గుర్తించడంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
బిహార్ రాష్ట్రానికి చెందిన ట్రిడస్ రెమెడీస్ అనే ఔషధ తయారీ సంస్థ ఉత్పత్తి చేసిన ఆల్మంట్ కిడ్ సిరప్‌లోని ఒక నిర్దిష్ట బ్యాచ్‌లో కల్తీ జరిగినట్లు పశ్చిమ బెంగాల్‌లో గుర్తించారు. ఈ సిరప్‌లో ఇథలీన్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ రసాయనం చిన్నారుల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ కల్తీ వ్యవహారాన్ని గుర్తించిన కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఔషధ నియంత్రణ మండలికి అధికారికంగా హెచ్చరికలు పంపింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ డీసీఏ అధికారులు రంగంలోకి దిగారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, సంబంధిత సిరప్ వినియోగం పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు.
ఈ మేరకు తెలంగాణ డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత బ్యాచ్‌కు చెందిన ఆల్మంట్ కిడ్ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే వాడకం ఆపేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా మెడికల్ షాపులు, ఔషధ గిడ్డంగులు, పంపిణీ కేంద్రాల్లో ఈ సిరప్ విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.
ఇది చిన్నారుల కోసం ఉపయోగించే ఔషధం కావడంతో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సిరప్ వాడకం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. పిల్లల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరించారు.
వాడకూడని సిరప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. మందు పేరు ఆల్మంట్ కిడ్ సిరప్ కాగా, బ్యాచ్ నంబర్ AL 24002. ఈ బ్యాచ్ జనవరి 2025లో తయారై, డిసెంబర్ 2026 వరకు గడువు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ బ్యాచ్‌కు చెందిన సిరప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని స్పష్టం చేశారు.
ఈ సిరప్‌కు సంబంధించి ఎవరైనా సమాచారం ఇవ్వాలన్నా, ఫిర్యాదులు చేయాలన్నా టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969ను సంప్రదించాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి సూచించింది. ప్రజల సహకారంతోనే ఇలాంటి ప్రమాదకర ఔషధాలపై చర్యలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తతే ప్రధానమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
ALSO READ: అర్థరాత్రి ఎలుకల మందు ఆర్డర్ చేసిన మహిళ.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..





