ఓట్ల లెక్కింపు తర్వాత వీవీప్యాట్ స్లిప్పులు సరి చూసుకోవచ్చు
లెక్కింపు అనంతరం వారం దాకా అవకాశం ఉంటుందన్న జ్ఞానేశ్ కుమార్
ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారం రోజుల వరకు వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో పోల్చిచూసుకునే అవకాశమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వెల్లడించారు. అయితే ఇందుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ విజయవంతమైందని తెలిపారు. ఇది మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయమన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో కలిసి.. రాష్ట్ర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు.
ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు
రాష్ట్రంలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరపాలని పార్టీలు కోరాయని.. అన్ని కోణాలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక పోలింగ్ ఎన్ని దశల్లో జరపాలో నిర్ణయానికి వస్తామన్నారు. బిహార్ అసెంబ్లీకి ఇటీవల లోపరహితంగా ఎన్నికలు జరిపామని.. గత కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారని చెప్పారు. తమిళనాడులో అంతకుమించి నిర్వహిస్తామని, రికార్డులు నెలకొల్పుతామని కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల సిబ్బంది, భద్రతాసిబ్బంది హామీ ఇచ్చారని తెలిపారు. భారీగా ఓటర్ల పేర్లను తొలగించారని వస్తున్న విమర్శలను ప్రస్తావించగా.. సర్ తో స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు రూపొందాయని, ఎన్నికల అధికారుల వృత్తినైపుణ్యం తేటతెల్లమైందని సీఈసీ బదులిచ్చారు.
మొత్తం 75 వేల పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలోని మొత్తం 75 వేల పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు సమకూరుస్తామన్నారు. కౌంటింగ్ పూర్తయ్యాక కూడా.. వారం రోజుల వరకు ఏ అభ్యర్థి అయినా రుసుము చెల్లించి.. ఈవీఎంలలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులు సరిపోల్చుకోవచ్చు. ఇకపై ఈవీఎంలలోని ఓట్లను లెక్కించే ముందే పోస్టల్ బ్యాలెట్లను రెండు రౌండ్లలో లెక్కిస్తారు అని వివరించారు. ప్రజాస్వామ్యంలో తమిళనాడుకు అద్భుతమైన గతచరిత్ర ఉందన్నారు. రాజకీయ పార్టీలతో జరిపిన సమావేశంలో.. ఆయా పార్టీలు ప్రాచీన ‘కుదవొలై’ ఎన్నికల విధానాన్ని సగర్వంగా ప్రస్తావించాయని తెలిపారు.
