ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకుని, ప్లేబ్యాక్ సింగర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మంగ్లీ మరోసారి వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు పాటలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు తమిళం, కన్నడ, హిందీ భాషల వరకూ విస్తరించినప్పటికీ, తాజాగా పాడిన ఒక పాటపై వచ్చిన విమర్శలు హాట్ టాపిక్‌గా మారాయి.
కన్నడ స్టార్ ధ్రువ సర్జా హీరోగా, దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా KD ది డెవిల్ లోని ప్రత్యేక గీతం “సర్కే చునర్ తేరి సర్కే” తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పాటలో అశ్లీలత ఎక్కువగా ఉందని, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మైనర్లపై దుష్ప్రభావం పడుతుందని నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో ముంబైకి చెందిన న్యాయవాది వినీత్ జిందాల్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు పంపిన ఫిర్యాదులో ఈ పాటను నిషేధించాలని కోరారు. ఫిర్యాదు తర్వాత చర్యలు ప్రారంభమవడంతో ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు.
ఈ పాటకు సంగీతం అందించిన అర్జున్, రచయిత రాకీబ్ ఆలం, దర్శకుడు ప్రేమ్‌తో పాటు గాయని మంగ్లీ పేర్లు కూడా ఫిర్యాదులో ప్రస్తావించబడ్డాయి. ఈ ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ నటి నోరా ఫతేహి నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇటీవల వరుసగా వివాదాల్లో నిలుస్తున్న మంగ్లీకి ఇది మరో సమస్యగా మారింది. గతంలో ఆమె పుట్టినరోజు వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగంపై వచ్చిన ఆరోపణలు పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఆ ఆరోపణలను ఆమె ఖండించారు. అంతేకాకుండా, తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌పై సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన సందర్భం కూడా ఉంది.
ప్రస్తుతం ఈ తాజా వివాదంపై మంగ్లీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ ఘటనతో ఆమె మరోసారి వార్తల్లో నిలవడం ఖాయం అయ్యింది. ఇక ఈ వివాదం ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
