
Voter Id: ఓటర్ ఐడీ కార్డు భారత పౌరులకెంతో ముఖ్యమైన గుర్తింపుపత్రం. ఓటు వేయడానికి మాత్రమే కాదు.. ప్రభుత్వ సేవలను పొందడానికి, బ్యాంక్ అకౌంట్లను తెరవడానికి, ప్రయాణాలకు, ఐడీ ప్రూఫ్ అడిగే అనేక చోట్ల ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఫిజికల్ ఐడీని ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరగడం అందరికీ సాధ్యం కాదు. పేపర్ కింద ముడుచుకుపోవడం, నీటితో తడవడం, దెబ్బతినడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా భారత ఎన్నికల సంఘం ఓటర్ కార్డును డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
2021లో జరిగిన నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈ-ఎపిక్ (డిజిటల్ ఓటర్ ఐడి) అనే కొత్త విధానాన్ని అధికారికంగా విడుదల చేశారు. ఇది పూర్తిగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో లభిస్తుంది. ఎడిట్ చేయలేని విధంగా ప్రత్యేక భద్రతా ప్రమాణాలతో రూపొందించారు. ఈ డిజిటల్ కార్డ్‌ను స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, లేకుండా ఎలాంటి పరికరం నుంచి అయినా సులభంగా డౌన్‌లోడ్ చేయవచ్చు. దీనిని ఎప్పుడైనా ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు చూపించవచ్చు. ఇలా డిజిటల్ రూపంలో ఉండటం వల్ల ఇకపైన ఫిజికల్ కార్డ్ దెబ్బతినడం పై ఆందోళన అవసరం లేదు.
ఈ డిజిటల్ ఓటర్ ఐడీని పొందేందుకు ముందుగా మీ ఓటర్ ఐడీ మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. అలాగే e-KYC ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరం. ఆ ప్రక్రియలో మీ వివరాలను ధృవీకరించేందుకు పాత ఫిజికల్ కార్డు వివరాలు కూడా అవసరం అవుతాయి. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి అయితే, ఎప్పుడైనా సులభంగా ఈ-ఎపిక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ డిజిటల్ కార్డు తీసుకోవడానికి మీరు అనుసరించాల్సిన దశలు ఇలా ఉంటాయి.
మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లోని బ్రౌజర్‌ను ఓపెన్ చేసి, అధికారిక ఎన్నికల సంఘం పోర్టల్‌కి వెళ్లాలి. అక్కడ “Download E-EPIC” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే లాగిన్ పేజీకి తీసుకెళ్తుంది. మీరు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి, లేదంటే మీ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
లాగిన్ అయిన తరువాత మరోసారి “Download E-EPIC” ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి. ఇక్కడ మీ EPIC నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ మీ ఫిజికల్ ఓటర్ కార్డు పైన 10 అంకెల రూపంలో ఉంటుంది. ఈ నంబర్‌ను ఎంటర్ చేసిన వెంటనే మీ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. వాటిని సరిచూసుకుని అన్ని సరైనట్లే ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
తరువాత మీ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన వెంటనే డౌన్‌లోడ్ బటన్ యాక్టివ్ అవుతుంది. దానిపై క్లిక్ చేస్తే మీ మొబైల్‌కి డిజిటల్ ఓటర్ ఐడీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ అవుతుంది. ఒకసారి డౌన్‌లోడ్ అయితే, దాన్ని ఎప్పుడైనా ఫోన్ గ్యాలరీలో లేదా ఫైల్ మేనేజర్‌లో చూసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు కూడా.
ఈ విధంగా డిజిటల్ ఓటర్ ఐడీ భారత పౌరులకు మరింత సౌకర్యవంతంగా మారింది. ఫిజికల్ కార్డు లేని పరిస్థితుల్లో కూడా సమస్య లేకుండా ఐడీ ప్రూఫ్ చూపించవచ్చు. ఇది కాలానికి తగ్గట్టు ఎన్నికల సంఘం చేపట్టిన మంచి, ఆధునిక ముందడుగు.





