
Viral Video: ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం లక్ష్యం ఎంతో గొప్పది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు ఆకలితో చదువు మానేయకుండా చూడటం, పోషకాహార లోపాన్ని తగ్గించడం, విద్యపై ఆసక్తిని పెంచడం కోసం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల ఈ పథకం అమలులో తీవ్రమైన నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో జరిగిన ఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలతో పాటు మేకలు కూడా మధ్యాహ్న భోజనం తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
मध्य प्रदेश के स्कूलों में बचपन से ही बच्चों को करुणा और पशु प्रेम सिखाया जाता है शायद तभी मिड डे मील बच्चों के साथ बकरियां भी कर रही हैं! pic.twitter.com/nTwU3gnoBi
— Anurag Dwary (@Anurag_Dwary) December 14, 2025
ఈ ఘటన కట్నీ జిల్లా ధిమర్‌ఖేడా తహసీల్ పరిధిలోని కోఠి గ్రామం, సెహ్రా టోలాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో చోటు చేసుకుంది. గిరిజనులు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల భవనం లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఒక ప్రైవేట్, శిథిలావస్థలో ఉన్న భవనంలో నడుపుతున్నారు. పరిశుభ్రతకు, భద్రతకు కనీస ప్రమాణాలు కూడా లేని ఆ ప్రదేశంలో చిన్నారులకు భోజనం వడ్డించడం స్థానికులకే కాకుండా నెటిజన్లను కూడా షాక్‌కు గురిచేసింది.
వైరల్ వీడియోలో చిన్నారులు నేలపై కూర్చుని పళ్లెంల్లో భోజనం చేస్తుండగా, అదే సమయంలో మేకలు వచ్చి అదే ఆహారాన్ని తినడం స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లలకు వడ్డించిన ఆహారాన్ని కాపాడే ప్రయత్నం చేయకపోవడం, జంతువులను అడ్డుకోకపోవడం అధికారుల పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పథకం అమలుపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు అందించే ఆహారం పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
ALSO READ: Lifestyle: మహిళలు రాత్రి పడుకునే ముందు ఇలా చేయకండి.. ఎందుకో తెలుసా?





