
తిరుపతి నగరంలో అర్ధరాత్రి ఓ దొంగ చేసిన హల్ చల్ స్థానికంగా కలకలం రేపింది. మహిళా విద్యార్థినులు ఉంటున్న లేడీస్ హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగుడు నిర్భయంగా లోపలికి చొరబడి సెల్ ఫోన్లను చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు హాస్టళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బ్రేకింగ్
తిరుపతి ఉమెన్స్ హాస్టల్స్ లోకి దూరిన దొంగ.. సెల్ ఫోన్ లు చోరీ
భవానీ సర్కిల్ సమీపంలోని ఫ్రెండ్స్ హాస్టల్, మహిత్ ఉమెన్స్ హాస్టల్ లో చోరీ
సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు
ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫోన్లు చోరీ… pic.twitter.com/YVgQbaA2v5
— Telugu Feed (@Telugufeedsite) December 17, 2025
భవానీ సర్కిల్ సమీపంలో ఉన్న రెండు లేడీస్ హాస్టళ్లలో ఈ ఘటన చోటుచేసుకోవడం భద్రతపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. రాత్రి నిశ్శబ్ద సమయంలో హాస్టళ్లలోకి ప్రవేశించిన దొంగ.. గదుల వద్ద తిరుగుతూ విద్యార్థినుల సెల్ ఫోన్లను అపహరించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఈ ఘటనలో ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న పలువురు విద్యార్థినులకు చెందిన ఫోన్లు చోరీకి గురైనట్లు సమాచారం.
మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన విద్యార్థినులు తమ ఫోన్లు కనిపించకపోవడంతో ఒక్కసారిగా హాస్టళ్లలో కలవరం చెలరేగింది. వెంటనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా దొంగ రాత్రిపూట హాస్టళ్లలోకి ప్రవేశించి నిర్లక్ష్యంగా తిరుగుతూ ఫోన్లు తీసుకెళ్లిన దృశ్యాలు బయటపడ్డాయి. దీంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
నగరంలో మహిళా హాస్టళ్ల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రివేళ భద్రతా సిబ్బంది పర్యవేక్షణ పెంచాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పోలీసులు త్వరలోనే నిందితుడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ALSO READ: BIG NEWS: తిరుమల ఆలయం వద్ద మహా అపచారం





