
US Additional Tariffs: భారతీయ వస్తువులపై ఇవాళ్టి (ఆగస్టు 27) నుంచి 50 శాతం అదనపు సుంకాలు అమలు కానున్నాయి. ఇప్పటికే అదనపు సుంకాల అమలుకు సంబంధించిన ముసాయిదా నోటీసును అమెరికా జారీ చేసింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే 4,800 కోట్ల డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 4.20 లక్షల కోట్ల విలువైన వస్తువులపై అదనపు సుంకాలు ఎఫెక్ట్ కనిపించనుంది. అమెరికా మొదట విధించిన 25 శాతం సుంకం ఆగస్టు 7న అమలులోకి రాగా రష్యా నుంచి ముడి చమురు, రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకాలను ట్రంప్ ప్రభుత్వం విధించింది.
ఇవాళ అర్థరాత్రి నుంచి కొత్త సుంకాలు అమలు
అమెరికా విధించిన 50 శాతం సుంకం ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నది. ఆగస్టు 27 తెల్లవారుజామున అంటే అమెరికా కాలమానం ప్రకారం 26వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి భారతీయ వస్తువులపై అదనంగా విధించిన 25 శాతం సుంకాలు అమలులోకి రానున్నాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. అమెరికా నుంచి భారీ సుంకాలు ఎదుర్కోనున్న రంగాలలో జౌళి, వస్ర్తాలు, రత్నాలు, నగలు, రొయ్యలు, చర్మం, చెప్పులు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్తు, మెకానికల్ యంత్రాలు ఉన్నాయి. ఈ అదనపు సుంకాల భారం పడని రంగాలలో ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి ఉన్నాయి. ఇప్పటికే అమెరికా చర్యను అనుచితం, అన్యాయం, అహేతుకం అంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.