Sanjeev Sanyal On UPSC Exams: దేశంలో యూపీఎస్సీ పరీక్షలను అత్యున్నత పరీక్షలుగా భావిస్తారు. ఈ పరీక్షల ద్వారానే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్,ఐఎఫ్ఎస్ అధికారులను సెలెక్ట్ చేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పరీక్షల విధానంపై ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్సీ పరీక్షల విధానం ఓ శుద్ధ దండుగ వ్యవహారం అని తేల్చేశారు. ఏఐ యుగంలోనూ ఇంకా పాత పద్ధతుల్లోనే పరీక్షల ఆధారిత విద్యా విధానాన్ని కొనసాగిస్తూ యూపీఎస్సీ సమయం వృధా చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏఐ యుగంలో పాత పద్దతులు ఎలా?
టెక్నాలజీ యుగంలో సంప్రదాయ పాఠ్య ప్రణాళికలకు, పరీక్షల విధానానికి కాలం చెల్లిందన్నారు. ఉద్యోగ నియామకాల కోసం యూపీఎస్సీ అనుసరిస్తున్న ప్రస్తుత పరీక్షల విధానం శుద్ధ దండగ వ్యవహారమని… తాజాగా ఎఎన్‌ఐ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో సంజీవ్ సన్యాల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇప్పుడు సాంకేతికత పెరిగింది. ఏఐ కీలకంగా మారింది. టెక్నాలజీ మారుతున్నంత వేగంగానే నైపుణ్యం, విజ్ఞానాలను సంపాదించే పద్ధతులు కూడా మారిపోయాయి. కానీ, ఈ వేగాన్ని అందుకునే స్థితిలో యూనివర్సిటీలు, వాటి పాఠ్య ప్రణాళికలు లేవు’’ అని సన్యాల్ అభిప్రాయపడ్డారు. నిన్న చూసిన టెక్నాలజీ ఈరోజు పాతబడిపోతున్న దశలో, అవే పాత విధానాలతో యూనివర్సిటీలు కుస్తీ పట్టడం సరికాదన్నారు. వడ్రంగి చేసే పనిని నైపుణ్యంగా చూసే వైఖరి ఈనాటికీ వృత్తి విద్యా కోర్సుల్లో కనిపిస్తోందని విమర్శించారు.
18 ఏళ్లకే ఉద్యోగంలో చేరిపోవాలి!
18 ఏళ్లకు డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిపోయే పరిస్థితి రావాలన్నారు సంజీవ్ సన్యాల్. అవసరమైతే ఆ తర్వాత కూడా చదువును కొనసాగించవచ్చునన్నారు. కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీలు ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించారు.





