అంతర్జాతీయం

రష్యాపై ఉక్రెయిన్, యెమెన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు

Ukraine- Israel Attacks: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు దిగగా, యెమన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో రష్యా అణు విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగగా,  ఇజ్రాయెల్ దాడుల్లో యెమన్ లోని విద్యుత్తు ప్లాంట్‌, గ్యాస్‌ స్టేషన్‌ ధ్వంసం అయ్యాయి.

రష్యా అణు విద్యుత్ కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు

34వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న ఉక్రెయిన్‌..  మరో వైపు రష్యాలోని పశ్చిమ కుర్క్స్‌ ప్రాంతంలోని అణు విద్యుత్తు కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్‌ ప్రయోగించిన 95 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుని ధ్వంసం చేశాయని రష్యా అధికారులు చెప్పారు. తమ పవర్‌, ఎనర్జీ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ డ్రోన్లు  దాడి చేశాయని తెలిపారు. ఈ దాడిలో న్యూక్లియర్‌ ప్లాంట్‌లో భారీగా మంటలంటుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. ఈ దాడి వల్ల ట్రాన్స్‌ ఫార్మర్‌ ధ్వంసం అయినా, రేడియో ధార్మికత స్థాయి సాధారణ స్థాయిలోనే ఉందని అధికారులు వెల్లడించారు.

సనాలోని విద్యుత్తు ప్లాంట్‌, గ్యాస్‌ స్టేషన్‌ ధ్వంసం

యెమెన్‌ రాజధాని సనాలోని విద్యుత్తు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసింది. కొద్ది రోజుల క్రితం హౌతీ రెబల్స్‌ ఇజ్రాయెల్‌ వైపు ఒక క్షిపణి ప్రయోగించిన క్రమంలో దానికి ప్రతీకారంగా ఇరాన్‌ మద్దతు ఉన్న ఈ గ్రూప్‌ పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడి జరిపింది. సనాలోని విద్యుత్తు ప్లాంట్‌, గ్యాస్‌ స్టేషన్‌ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసిందని అక్కడి మీడియా తెలిపింది. మిలిటరీ అకాడమీ, ప్రెసిడెంట్‌ ప్యాలస్‌ సహా పలు ప్రాంతాల్లో పెద్దయెత్తున పేలుడు శబ్దాలు విన్పించినట్టు స్థానిక పౌరులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button