
ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన నర్సాయపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. అమాయక పిల్లలను చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని మోసం చేసిన ఈ అఘాయిత్యం గ్రామస్తులను ఆగ్రహానికి గురి చేసింది.
ఎర్రగొండపాలెం మండలం నర్సాయపాలెం గ్రామానికి చెందిన పిక్కిలి ఆంజనేయులు (40) అనే వ్యక్తి చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులు ఉండటంతో దుకాణం సమీపంలో నివసిస్తున్న 10, 11 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాలికలు బిస్కెట్లు కొనుగోలు చేసేందుకు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భాన్ని అవకాశంగా మలచుకున్న నిందితుడు ఒక బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని ఆశ చూపి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు.
మరో బాలికకు ఇంటి బయట అంట్లు తోమితే బిస్కెట్లు ఇస్తానని చెప్పి బయటే ఉంచాడు. ఇంట్లోకి తీసుకెళ్లిన బాలికపై నోట్లో గుడ్డ కుక్కి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బయట ఉన్న మరో బాలికపై కూడా అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ఈ దారుణం రెండు కుటుంబాలను తీవ్రంగా కలిచివేసింది.
దాడి అనంతరం బాలికలు ఇళ్లకు చేరుకున్నప్పుడు వారి దుస్తులపై రక్తం మరకలు గమనించిన తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని వారు వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహంతో నిందితుడి ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే ఆంజనేయులు పరారైనట్లు తెలిసింది.
ఈ ఘటనపై శుక్రవారం బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో భయాందోళనకు దారి తీశాయి.
ALSO READ: GOOD NEWS: ఈ రోజు వీరికి భారీ లాభాలు





