TV Price Hike: త్వరలో టీవీల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మెమరీ చిప్‌ల కొరత, అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కారణంగా ధరలు పెరగనున్నాయి. 2026 జనవరి నుంచి టీవీల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వెల్లడించాయి.
టీవీల ధరలు ఎంత పెరుగుతాయంటే?
ఇటీవల డాలర్ మారకంలో రూపాయి విలువ తొలిసారిగా 90 దాటింది. మరోవైపు టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్‌సెల్, సెమీ కండక్టర్ చిప్‌లు, మదర్‌బోర్డు వంటివి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ సర్వర్లకు హై బ్యాండ్‌విడ్త్ మెమరీ చిప్‌ల డిమాండ్ భారీగా ఉంది. ఫలితంగా అన్ని రకాల మెమరీ చిప్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి. మరోవైపు చిప్ తయారీదారులు అధిక లాభాలందించే ఏఐ చిప్‌ల తయారీపై మొగ్గు చూపుతున్నందు వల్ల టీవీల వంటి లెగసీ డివైస్ ల సరఫరా తగ్గిపోయిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎల్‌ఈడీ టీవీల ధర 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.
భారీగా పెరిగిన మెమరీ చిప్‌ల ధర
కొన్ని టీవీ తయారీ కంపెనీలు ఇప్పటికే టీవీల ధర పెరిగే అవకాశం ఉన్నట్టు డీలర్లకు తెలియచేశాయి. గత మూడేళ్ల కాలంలో మెమరీ చిప్‌ల ధర భారీగా పెరిగింది. థామ్సన్, కోడక్ లాంటి టీవీల తయారీ లైసెన్సు గల సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. దీంతో టీవీల ధరలు 7-10 శాతం పెరిగే ఆస్కారం ఉన్నదని తెలిపింది. రాబోయే రెండు త్రైమాసికాల్లోనూ కూడా చిప్‌ల ధర పెరుగుతూనే ఉండవచ్చని, అదే జరిగితే ధరలు మరింత పెంచక తప్పదని వెల్లడించింది.
Read Also: పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ రైలు, రైల్వేమంత్రి కీలక ప్రకటన!





