
Russia Earthquake: భారీ భూకంపంతో రష్యా వణికింది. కమ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి జపాన్, అమెరికా, గ్వామ్ లాంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో పలు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు.
4 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్న అలలు
రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్- కమ్చట్కా నగరానికి 126 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. 18 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని వెల్లడించింది. ఈ భూకంపం ప్రారంభంలో 8.7 తీవ్రతగా ఉన్నట్లు వెల్లడించిన USGS.. ఆ తర్వాత 8.8గా సవరించింది. భూకంప తీవ్రత కారణంగా కమ్చట్కా ద్వీపకల్పంలో 4 మీటర్ల ఎత్తులో సునామీ అలలు ఎగిసిపడుతున్నాయి. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో సునామీ అలలు 3-4 మీటర్ల ఎత్తుతో తాకాయని అధికారులు తెలిపారు. ఎవరికి గాయాలు కానప్పటికీ, కిండర్ గార్టెన్ భవనం దెబ్బతిన్నట్లు వెల్లడించారు. రష్యాలో గత కొన్ని దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే అని ఆ దేశ జియోలాజికల్ అధికారులు తెలిపారు.
జపాన్, అమెరికాకు సునామీ హెచ్చరికలు
రష్యా భూకంపం నేపథ్యంలో జపాన్ లోని హొక్కైడో ఉత్తర తీరంలో సునామీ అలలు భారీగా ఎగిసిపడుతున్నట్లు జపాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. పసిఫిక్ తీరంలోని ప్రజలకు వెంటనే ఖాళీ చేశాయలని జపాన్ ఆదేశాలు జారీ చేసింది. సునామీ అలలతో నష్టం సంభవించే అవకాశం ఉందని తెలిపింది. తీర ప్రాంతాలు, నదీ తీరాల నుంచి ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెల్లాలని సూచించింది. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. అటు అమెరికాలోని హవాయి, అలాస్కా రాష్ట్రాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలో 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.