
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం పేదల ఎదురు చూస్తున్నారు. గతేడాది స్వీకరించిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కొత్త కార్డు రాలేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుల్లో మార్పుల కోసం చేసిన దరఖాస్తుల్లోనూ గందరగోళం నెలకొంది. కొత్తగా పెళ్లి అయిన యువత వారి తల్లిదండ్రుల పేరిట ఉన్న కార్డుల్లో పేర్లు తొలగించారు. అయితే కొత్తగా కార్డులు ఇంకా జారీ కాలేదు. ఉన్నకార్డుల్లో పిల్లల పేర్లను కూడా ఇంకా చేర్చలేదు. దీంతో ఉన్న పేరు తొలగించడంతో రేషన్ బియ్యానికి, సంక్షేమ పథకాలకు వారు దూరమవుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేతను చేపట్టింది. ధనవంతులై ఉండి కూడా పేదలు పొందాల్సిన పథకాలు అక్రమంగా తీసుకోవడంపై చర్యలకు సిద్ధమైంది. వీలైనంత త్వరగా వారి కార్డులు కట్ చేసేందుకు సర్వేకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇంకా జరిగితే ప్రభుత్వ ఖజనాకు గండిపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఉన్న కార్డులు వీలైనంత త్వరగా సరెండర్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్కార్డు ద్వారా ఎంత ప్రజా సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.