ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. కాసేపట్లో దాడి తప్పదనే పరిస్థితి నుంచి.. ఇప్పట్లో సైనిక చర్య ఏదీ చేపట్టే అవకాశం లేదనే దశకు వచ్చింది. ప్రస్తుతానికి దాడి వద్దంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇతర దేశాల నేతలు సూచించడం, ఆందోళనకారులకు ఉరిశిక్ష వేయడం అంశంలో ఇరాన్ వెనక్కి తగ్గడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అటు ఇరాన్‌పై దాడి వద్దని, ఆ దేశంతో దౌత్యపరమైన చర్చలకు తాము సహకరిస్తామని నెతన్యాహుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు.
ఇరాన్ పై దాడి వద్దన్న నెతన్యాహు
ప్రజా ఆందోళనలను పాశవికంగా అణచివేసేందుకు ఇరాన్ ప్రయత్నించడంతో ఆగ్రహించిన ట్రంప్.. పోరాడండి, సాయం వస్తోందని ఇరాన్ నిరసనకారులకు ఇటీవల పిలుపునిచ్చారు. అన్నట్టుగానే ఇరాన్‌పై సైనిక చర్యకు ఏర్పాట్లు చేపట్టారు. కానీ, చివరి నిమిషంలో నెతన్యాహుతోపాటు పలు దేశాల ఒత్తిడితోనే దాడిని వాయిదా వేసుకున్నారని న్యూయార్క్ టైమ్స్ తాజాగా వెల్లడించింది. ట్రంప్‌తో మాట్లాడిన నెతన్యాహు ఇరాన్‌పై దాడికి ఇది సరైన సమయం కాదని, ఈ విషయంలో పునరాలోచించాలని వ్యక్తిగతంగా ఒత్తిడి చేశారని వెల్లడించింది. ఇరాన్‌పై దాడి కోసం భారీగా ఆయుధ సంపత్తి, నిధులు అవసరమని.. అదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికా మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ దాడి చేసే అవకాశమూ ఉందని నెతన్యాహు వివరించినట్టు తెలిపింది. మరోవైపు ఖతార్, యూఏఈ తదితర దేశాలు కూడా ప్రస్తుతానికి దాడి వద్దని.. దౌత్యపరంగా, ఇతర మార్గాల్లో ఒత్తిడి పెంచుదామని కోరినట్టు వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో పుతిన్ చర్చలు
ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధమవడం, పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం వేర్వేరుగా చర్చలు జరిపారు. శాంతి నెలకొల్పేందుకు రాజకీయ, దౌత్యపరమైన మార్గాలను అనుసరించాలని కోరారు. ఈ అంశంలో కలసి పనిచేద్దామన్నారు. ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.





