
Trump Junior: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ భారత పర్యటనలో అనంత్ అంబానీ కుటుంబం ఆహ్వానం మేరకు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ భారతీయ సంస్కృతిని సమీపంగా అనుభవించారు. ఉదయ్‌పూర్‌లో జరగనున్న భారతీయ- అమెరికన్ వివాహంలో పాల్గొనడానికి గురువారం ఆయన భార్య వెనెస్సా ట్రంప్‌తో కలిసి భారత్‌కు చేరుకున్నారు. దేశానికి వచ్చిన వెంటనే వారు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్‌మహల్‌ను సందర్శించారు. తాజ్‌మహల్ యొక్క శిల్పకళ, నిర్మాణ వైభవం, ప్రేమకు ప్రతీకగా నిలిచే ఆ మహోన్నత కట్టడాన్ని ట్రంప్ జూనియర్ ప్రపంచంలోనే అత్యంత అద్భుత కళాఖండాలలో ఒకటిగా అభివర్ణించారు.
తాజ్‌మహల్ పర్యటన అనంతరం ట్రంప్ దంపతులు అనంత్ అంబానీ కుటుంబ ఆహ్వానం మేరకు గుజరాత్‌కు ప్రయాణమయ్యారు. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ స్థాపించిన వంటారా వన్యప్రాణాల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఈ పర్యటనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆధునిక సదుపాయాలతో, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రూపొందించిన ఆ కేంద్రాన్ని ట్రంప్ దంపతులు ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. అక్కడి జీవవైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ విధానం వారికి భారీస్థాయిలో ఆకట్టుకుందని అక్కడి సిబ్బంది తెలిపినట్లు సమాచారం.
View this post on Instagram
కేవలం పర్యటించడానికే కాకుండా భారతీయ సంప్రదాయాలను అనుభూతి చెందే అవకాశాన్ని కూడా ట్రంప్ జూనియర్ పొందారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో కలిసి జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ట్రంప్ జూనియర్, వెనెస్సా ట్రంప్ దాండియా నృత్యంలో పాల్గొని సందడి చేశారు. గుజరాతీ జానపద గీతాలు, రంగురంగుల వాతావరణం, భారతీయ సాంప్రదాయ నృత్య శైలి ఇలా అన్ని కలిసి ఆ వేడుకను మరింత అద్భుతంగా మార్చాయి.
జామ్‌నగర్ పర్యటన పూర్తయిన అనంతరం ట్రంప్ కుటుంబం తిరిగి ఉదయ్‌పూర్‌కు వెళ్లి జరగనున్న వివాహ వేడుకల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ఇటీవలి కాలంలో అమెరికన్ ఉన్నత నాయకులు భారత్‌ను వరుసగా సందర్శిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన కూడా మరో ముఖ్య ఘట్టంగా నిలిచింది. ఏప్రిల్ నెలలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు భారత్ పర్యటించి తాజ్‌మహల్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ఆ చారిత్రాత్మక స్మారక చిహ్నం అందాలను జేడీ వాన్స్ ‘అందమైన చారిత్రాత్మక ప్రదేశం’ అని అభివర్ణించి, భారతీయుల ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికన్ నాయకుల భారత్ పర్యటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ALSO READ: Shocking: ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న వరుడికి హ్యాండ్ ఇచ్చిన పెళ్లికూతురు





