
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా పలు ఊహాగానాలు వినిస్తున్నాయి. చేతుల మీద కమిలిన గాయాలు, పుతిన్ తో సమావేశం సమయంలో తూలుతూ నడవడం లాంటి సంఘటనల నేపథ్యంలో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన రేకెత్తించింది.ఈ నేపథ్యంలో ట్రంప్ వైట్ హౌస్ లో లేరంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత రెండు రోజులుగా ఆయన కనిపించడం లేదు. మీడియా ముందుకు రాలేదు. వీకెండ్ పబ్లిక్ ఈవెంట్లు కూడా వైట్ హౌస్ షెడ్యూల్ లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ ట్రంప్ కు ఏమైంది? ఎక్కడున్నాడు? అసలు ఏం జరుగుతుంది? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఎక్స్ లో ‘TRUMP IS DEAD’ ట్రెండింగ్‌లో ఉంది.
ట్రంప్ ఆరోగ్యంపై ఎన్నో అనుమానాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌తో భేటీ సందర్భంగా ట్రంప్ చేతిపై కమిలిన గాయాలు కనిపించాయి. న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్ వరల్డ్ కప్ చూసేందుకు వచ్చిన ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు. కాళ్ల నరాలు ఉబ్బిపోయినట్లుగా, కుడి చేతిపై పలు చోట్ల వాపు ఉన్నట్లు కనిపించింది. ఇప్పుడు ట్రంప్ కుడి చేతి వెనుక భాగంలో గాయం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
జేడీ వ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు
ట్రంప్ అనారోగ్యం వార్తల వేళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ట్రంప్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఆయన ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ట్రంప్ తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని చెప్పారు. అమెరికా ప్రజలకు ఇంకా గొప్ప పనులు చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఒకవేళ ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.