
Nimisha Priya Case: యెమన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిమిష ప్రియ ఉరి శిక్ష నుంచి బయటపడేందుకు ఉన్న ఏకైక ఆప్షన్, ‘బ్లడ్ మనీ’ కూడా పని చేయనట్టే కనిపిస్తుంది. ఓ వైపు భారత ప్రభుత్వం, మరోవైపు ముస్లీం మత పెద్దలు రంగంలోకి దిగి ఆమె ఉరి శిక్షను ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భారత ప్రభుత్వం యెమన్ సర్కారుతో సంప్రదింపులు జరపగా, మత పెద్దలు బాధిత కుటుంబంతో చర్చలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో యెమన్ సర్కారు.. ఇవాళ( జులై 16న) అమలు చేయాల్సిన ఆమె ఉరి శిక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నిమిష కుటుంబానికి కాస్త ఊరట లభించిందని భావించే లోపే, బాధిత కుటుంబ సభ్యులు బాంబ్ పేల్చారు. నిమిషకు ఉరేసరి అని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
బ్లడ్ మనీకి ఒప్పుకోమన్న బాధిత కుటుంబ సభ్యులు
నిమిష ఉరి శిక్ష నుంచి బయట పడేందుకు ఉన్న ఏకైక మార్గం బ్లడ్ మనీ. అంటే, బాధిత కుటుంబం అడిగినంత డబ్బులు ఇవ్వాలి. దానికి నిమిష కుటుంబం అంగీకరించింది. 10 లక్షల డాలర్లు ఇచ్చేందుకు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో లాయర్ తో పాటు మత పెద్దలు బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపారు. తాజాగా మృతుడి కుటుంబం నుంచి సంచలన ప్రకటన వచ్చింది. బ్లడ్ మనీకి అంగీకరించేది లేదని తెలిపింది. ఇస్లామిక్ లా ప్రకారం ఆమెకు శిక్ష పడాల్సిందేనని తలాల్ సోదరుడు అబ్దెల్ తేల్చి చెప్పాడు. బాధిత కుటుంబ నుంచి ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో నిమిషను కాపాడటం ఎవరి వల్ల కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, ఇంకా సంప్రదింపులు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా నిమిష మరణ శిక్షపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు నిమిష ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం తరఫున, మత పెద్దల వైపు నుంచి చర్చలు జరుగుతున్నాయి.