
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కట్కరీ తెగకు చెందిన 20 ఏళ్ల గిరిజన యువతిని కేవలం రూ.3 లక్షలకు అమ్మినట్లుగా వచ్చిన ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంలో భర్తతో పాటు అతని తల్లి, ఇద్దరు మధ్యవర్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళలపై జరుగుతున్న అక్రమాలు, ముఖ్యంగా గిరిజన యువతులపై జరుగుతున్న దౌర్జన్యాలకు ఇది మరో దారుణ ఉదాహరణగా మారింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాసిక్‌కు చెందిన ఓ వ్యక్తి తన తల్లితో కలిసి ఈ అక్రమ వ్యవహారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తుల సహాయంతో రూ.3 లక్షల మొత్తాన్ని చెల్లించి కట్కరీ తెగకు చెందిన యువతిని కొనుగోలు చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 2024 మే నెలలో ఆ యువతిని బలవంతంగా పెళ్లి చేసుకున్నారని, తన ఇష్టానికి విరుద్ధంగా ఈ వివాహం జరిగిందని ఆమె వాపోయింది. పెళ్లైనప్పటి నుంచే భర్త కుటుంబం తనను శారీరకంగా, మానసికంగా వేధించిందని, కులపరంగా అవమానించిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
పెళ్లి తర్వాత భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు తనపై నిరంతరం దాడులు చేశారని, తిట్లు, బెదిరింపులతో మానసిక క్షోభకు గురిచేశారని ఆమె ఆరోపించింది. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా భర్త తనపై చేయి చేసుకున్నాడని, సరైన ఆహారం కూడా ఇవ్వలేదని వాపోయింది. తీవ్ర వేధింపుల కారణంగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అయినా ఎవరూ తనను ఆదుకోలేదని కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనలో కుల దూషణలు కూడా జరిగాయని ఆమె ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది.
బిడ్డ పుట్టిన తర్వాత పరిస్థితులు మరింత విషమించడంతో, గత ఏడాది జూన్ నెలలో ఆమె తన పుట్టింటికి చేరింది. అక్కడ తల్లిదండ్రుల సంరక్షణలో ఉండుతూ బిడ్డను పెంచుకుంటోంది. అయితే ఈ నెల 6వ తేదీన భర్త కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా వచ్చి బిడ్డను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఈ ఘటనపై వాడా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భర్త, అతని తల్లి, ఇద్దరు మధ్యవర్తులపై మానవ అక్రమ రవాణా, అక్రమ వివాహం, కుల దూషణ, గృహహింసకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బాధితురాలికి పూర్తి న్యాయం చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు.
ALSO READ: Sreeleela: అబ్బాయిల జోలికి వెళ్లదలుచుకోలేదు





