జాతీయం

విమాన ప్రమాదంలో కుట్రకోణం.. దర్యాప్తు అధికారుల ఫోకస్!

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నది. ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ) ఆధ్వర్యంలో గుజరాత్‌ పోలీసులు, ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) కలిపి విచారణ చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికాకు చెందిన నేషనల్‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు కూడా దర్యాప్తు చేస్తోంది. విమానం గాల్లోకి ఎగిరిన కాసేపట్లోనే కూలిపోవడం వెనుక ఏదో జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇందులో కుట్ర కోణం కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని ఈ దిశగా విచారణ చేశారు.  వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. అటు విమానం టేకాఫ్‌ అయ్యేందుకు అనుమతి వచ్చిన సిబ్బందికి సంబంధించి ఫోన్లను కూడా దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటు విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

బాధితుల బంగారం, నగదు పోలీసులకు అందజేత

అటు ఈ విమాన ప్రమాదం జరిగి ప్రదేశంలో దొరికిన విలువైన ఆభరణాలు, నగదును రాజేష్ పటేల్ అనే వ్యాపారవేత్త సేకరించి పోలీసులకు అప్పగించారు. ఆయన నిజాయితీని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రమాద స్థలానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉండే ఆయన, మరికొంత మంది వ్యక్తులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విమాన శిథిలాల్లో సుమారు 70 తులాల బంగారు ఆభరణాలు, 8 వెండి వస్తువులు, రూ.50 వేల నగదుతో పాటు కొన్ని అమెరికన్‌ డాలర్లు తనకు దొరికినట్లు తెలిపారు. వాటిని సహాయక చర్యల్లో పాల్గొంటున్న పోలీసు అధికారికి అప్పగించానన్నారు. ఘటన స్థలంలో దొరికిన వస్తువులను మృతుల బంధువులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.

Read Also: ఏడాదికి టోల్ చార్జీ జస్ట్ రూ. 3 వేలు.. కేంద్రం కీలక నిర్ణయం!

Back to top button