
క్రైమ్ మిర్రర్ : బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం అపహరణకు గురైన ఆరేళ్ల బాలిక అరులీయా మోజెస్ విగతజీవిగా కనిపించడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్ అపార్ట్మెంట్ సెల్లార్లో ఆడుకుంటున్న చిన్నారిని అదే అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్ అనే వ్యక్తి అపహరించినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
చిన్నారిని విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని నిందితుడు డిమాండ్ చేసినట్లు సమాచారం. అనంతరం చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి అపార్ట్మెంట్ సమీపంలోని నీటి సంపులో పడేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు చిన్నారి ఆడుకుంటున్న సమయంలో సెక్యూరిటీ గార్డు ఆమెను అనుసరించినట్లు గుర్తించినట్లు తెలిసింది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఆర్మీ అధికారులు, సిబ్బంది నివాసాలు ఉండటంతో చిన్నారి ఆచూకీ కోసం వారు కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. చిన్నారి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఘటన వెనుక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
also read: ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా ఉత్సవాలు: అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో భక్తుల రద్దీ!