
Tragedy: ఇటీవల బిహార్ రాష్ట్రంలో జరిగిన ఒక పెళ్లి విందులో జరిగిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పాట్నా నగరానికి సమీపంలోని మోకామా ప్రాంతంలో జరిగిన ఈ వివాహ రిసెప్షన్‌లో అతిథులకు వడ్డించిన ఆహారం పూర్తిగా పాడైపోయింది. అయితే, పెళ్లిలో పాల్గొన్న వారు ఏమీ గ్రహించకుండా విందు స్వీకరించగా.. కొద్ది గంటల్లోనే కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, తల తిరుగుడు వంటి లక్షణాలు కనిపించాయి. మొదట్లో సాధారణ అస్వస్థతగా భావించిన అతిథులు, పరిస్థితి మరింత దిగజారిన తర్వాత ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో ఒక్క రాత్రిలోనే కనీసం 500 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆహార భద్రతా విభాగం ఈ సంఘటనపై అత్యవసర దర్యాప్తు చేపట్టి, రిసెప్షన్‌లో వడ్డించిన పన్నీర్ వంటకాలు, రసగుల్లాలో తీవ్రమైన కలుషితాన్ని గుర్తించింది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల నివేదిక ప్రకారం.. ఆహార నమూనాల పరీక్షల్లో 8.8 మిలియన్లకు పైగా సూక్ష్మజీవులు ఉన్నట్లు తేలింది. సాధారణంగా ఆహారంలో ఇంతటి అధిక స్థాయిలో బాక్టీరియా ఉండటం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని అధికారులు స్పష్టం చేశారు. ఈ సూక్ష్మజీవులు ఆహారం సరైన విధంగా నిల్వ చేయకపోవడం, పాడైపోయినా ఆహారాన్ని గుర్తించకుండా వడ్డించడం, శుభ్రత లోపాలు వంటి కారణాల వల్ల ఏర్పడినట్లు ప్రాథమిక నివేదికల్లో పేర్కొన్నారు.
విందు అనంతరం మరుసటి రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. ఆస్పత్రుల్లో ఒక్కసారిగా చేరిన రోగుల సంఖ్య పెరగడంతో వైద్య సిబ్బంది అదనపు సహాయాన్ని ఉపయోగించి చికిత్స అందించారు. ఈ సంఘటనతో పెళ్లి వేడుక యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఆహారం సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ALSO READ: Paracetamol: ‘మోతాదు మించితే పారాసిటమాల్ ప్రమాదమే’





