
Toll Plaza: ఫాస్టాగ్ లేకుండా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం పెద్ద ఉపశమనం ఇచ్చింది. గత కొన్నేళ్లుగా ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాల వద్ద నగదు లేదా యూపీఐ ద్వారా చెల్లింపు చేసేవారికి విధిస్తున్న రెట్టింపు టోల్ ఛార్జీ అనేక మందికి భారమయ్యేది. రుసుము తక్షణం రెండింతలుగా పెరగడం వల్ల ప్రయాణ ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయేవి. ముఖ్యంగా తరుచుగా ప్రయాణించే డ్రైవర్లు, చిన్న వ్యాపార వాహనదారులు ఈ నిబంధన వల్ల ఇబ్బందులు పడేవారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వారికి పెద్ద ఊరటను ఇచ్చింది. కొత్త నియమాల ప్రకారం ఇకపై ఫాస్టాగ్ లేకుండా యూపీఐ ద్వారా టోల్ చెల్లిస్తే కేవలం 25 శాతం అదనపు రుసుముతోనే ప్రయాణం కొనసాగించవచ్చు. అంతకుముందుతో పోలిస్తే ఈ మార్పు వాహనదారులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గిస్తుంది.
ఇప్పటివరకు ఫాస్టాగ్ లేని వాహనదారులు ఎలాంటి టోల్ గేటు వద్దైనా పూర్తి టోల్ మొత్తానికి రెట్టింపు చెల్లించాల్సివచ్చేది. ఉదాహరణకు రూ.100 టోల్ ఉంటే, నగదు లేదా యూపీఐతో చెల్లించినా రూ.200 తీసుకునేవారు. ఈనాటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. యూపీఐ ద్వారా చెల్లిస్తే ఈ మొత్తమే మారిపోనుంది. దీంతో యూపీఐ పేమెంట్‌ను ప్రోత్సహిస్తూ కేంద్రం డ్రైవర్లకు తగిన సడలింపు కల్పించినట్లైంది. అయితే నగదు చెల్లింపులకు మాత్రం పాత నిబంధన కొనసాగుతుందన్న విషయం స్పష్టంగా పేర్కొంది. అంటే ఒకవేళ ఎవరు నగదు చెల్లించాలనుకుంటే, వారు మునుపటిలాగే రెట్టింపు టోల్‌ను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది నగదు వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రానిక్ పేమెంట్స్‌ను మరింతగా ప్రోత్సహించే దిశగా తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది.
డిజిటల్ పేమెంట్ వ్యవస్థపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రహదారులు, టోల్ ప్లాజాలు పూర్తిగా డిజిటల్ లావాదేవీల వైపు మళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫాస్టాగ్ వ్యవస్థ కూడా ఈ డిజిటల్ మార్పులో అత్యంత ముఖ్యమైన అడుగు. అయితే కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్ తీసుకోకపోవడం, లేదా ఫాస్టాగ్ లో డబ్బు లేకపోవడం, స్కానింగ్ సమస్యలు వంటి కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటి పరిస్థితుల్లో నేరుగా రెట్టింపు చార్జీ విధించడం వాహనదారులపై భారంగా మారింది. ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ దిశగా అడుగు వేస్తూనే, డ్రైవర్లపై పడే భారం తగ్గించేందుకు 25 శాతం అదనపు రుసుము నిర్ణయాన్ని తీసుకుంది. ఇది వినియోగదారులకు మేలు చేస్తూనే, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ద్వంద ప్రయోజనం కలిగిస్తుంది.
ఈ నిర్ణయంతో వాహనదారులు మరింత సౌకర్యంగా టోల్ ప్లాజాలను దాటవచ్చు. యూపీఐ పేమెంట్స్ ఇప్పటి తరానికి ఎంతో సులభమైన చెల్లింపు మార్గం. స్మార్ట్‌ఫోన్‌లో కేవలం కొన్ని సెకన్లలోనే చెల్లింపులు జరిగిపోవడం వల్ల నగదు అవసరం తగ్గిపోతుంది. కొత్త నిబంధనల కారణంగా ఫాస్టాగ్ లేకపోయినా అధికంగా చెల్లించాల్సిన భయం తగ్గిపోతుంది. అయితే దీర్ఘకాలంలో ఫాస్టాగ్ వాడకం వాహనదారులకు మరిన్ని ప్రయోజనాలు ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం తక్షణమే ఉపయోగపడే మార్పు అయినప్పటికీ, డ్రైవర్లు ఫాస్టాగ్‌ను తప్పనిసరిగా కలిగి ఉండడం వల్ల మరింత సౌకర్యం పొందే అవకాశం ఉంది.
ALSO READ: Emotional post: తండ్రి కృష్ణను గుర్తుచేసుకుని మహేశ్ బాబు భావోద్వేగం





