
మేడారం మహాజాతర నేటితో ముగింపు దశకు చేరుకుంటోంది. చివరి రోజు కావడంతో మేడారం అరణ్యం భక్తజన సముద్రంగా మారింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం మేడారానికి తరలివచ్చారు. గద్దెలపై సారలమ్మ, సమ్మక్కలు కొలువుదీరడంతో భక్తులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాజాతర చివరి ఘట్టం కావడంతో భక్తుల హాజరు మరింత పెరిగింది. వనం నుంచి జనంలోకి వచ్చిన వనదేవతలు తిరిగి వనంలోకి వెళ్లే పవిత్ర ఘట్టం ఈ రోజే జరగనుంది.
గురువారం గద్దెలపై కొలువైన అమ్మవార్లు భక్తుల పూజలు, మొక్కులు స్వీకరించిన అనంతరం నేడు చిలకలగుట్టకు వనప్రవేశం చేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు భావోద్వేగంతో అమ్మవార్లకు వీడ్కోలు పలుకుతున్నారు. తిరిగి 2028లో కలుద్దామని భక్తులు అమ్మవార్లను ప్రార్థిస్తూ కన్నీటి వీడ్కోలు ఇస్తున్నారు. సంప్రదాయ రీతుల్లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ఘట్టంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగియనుంది.
చివరి రోజు కావడంతో మేడారానికి వెళ్లే మార్గాల్లో తీవ్ర రద్దీ నెలకొంది. మేడారం నుంచి తాడ్వాయి వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని చోట్ల భక్తులు 10 నుంచి 12 గంటల వరకు వాహనాల్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, తాగునీరు సరిగా అందక భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల తరలింపులో ఆర్టీసీ పూర్తిగా విఫలమైందని పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది భక్తులతో ఆర్టీసీ బస్ స్టాండ్లు కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి ఎదురు చూసినా బస్సులు అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులే కనిపించకపోవడంతో గందరగోళం నెలకొంది. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సరిగా అమలు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అయినా సరే, అమ్మవార్ల దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ భక్తిశ్రద్ధతో మహాజాతరలో పాల్గొన్నామని చెబుతున్నారు. వనదేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఆకాంక్షతో భక్తులు మేడారం నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ముగింపు ఘట్టంతో మరోసారి మేడారం మహాజాతర చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మారింది.
ALSO READ: కారు, బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తను వదిలేసిన భార్య.. అంతటితో ఆగకుండా..





