Wednesday, February 25, 2026
HomeజాతీయంBengal Political Storm: బెంగాల్ లో ఈడీ రైడ్స్ దుమారం, కోల్ కతాలో మమతా నిరసన...

Bengal Political Storm: బెంగాల్ లో ఈడీ రైడ్స్ దుమారం, కోల్ కతాలో మమతా నిరసన ర్యాలీ!

పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో ఈడీ సోదాలపై పశ్చిమ బెంగాల్‌ లో రచ్చ కొనసాగుతోంది. మమతకు వ్యతిరేకంగా ఈడీ, దర్యాప్తు సంస్థ సోదాలను సవాలు చేస్తూ టీఎంసీ.. కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. ఇరుపక్షాలు కోర్టును ఆశ్రయించగా.. అక్కడా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, పిటిషన్ల విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు.

బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ నిరసనలు

బొగ్గు అక్రమ రవాణా కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ జైన్‌ ఇల్లు, సంస్థ కార్యాలయాల్లో గురువారం ఈడీ తనిఖీలు చేసింది.  ఈ తనిఖీలను వ్యతిరేకిస్తూ సీఎం మమతా రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దక్షిణ కోల్‌కతాలో ఆమె ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర మంత్రులు, టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎంసీ అంతర్గత వ్యూహాలను చోరీ చేసేందుకు బీజేపీ సర్కారు ఈడీని వాడుకుంటోందని, రాజకీయ కక్షతోనే దాడి చేయిస్తోందని సీఎం మమత ఆరోపించారు. ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో తాను ఐ-ప్యాక్‌ కార్యాలయానికి, ప్రతీక్‌ జైన్‌ ఇంటికి వెళ్లడాన్ని సమర్థించుకున్నారు.

మమతపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న ఈడీ

మనీలాండరింగ్‌ కేసులో ఐ-ప్యాక్‌ కార్యాలయాల్లో సోదాలు జరుపుతుండగా..  సీఎం మమత వచ్చి కీలక ఆధారాలను తీసుకెళ్లిపోయారని, ఆమెపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. తమ విధులకు ఆటంకం కలిగించిన సీఎం మమత, సీనియర్‌ పోలీసు అధికారులు, ఇతరులపై సీబీఐతో విచారణ జరిపించాలని అభ్యర్థిస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సోదాలు చేసిన ప్రాంతాల నుంచి తాము సేకరించిన ఆధారాలను మమత, ఆమె అనుచరులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని.. వాటిని తక్షణమే సీజ్‌ చేసి తమకు అప్పగించేలా చూడాలని ఈడీ కోరింది. అటు, టీఎంసీ కూడా ఈడీకి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించింది. ఐ-ప్యాక్‌ కార్యాలయాల్లో సోదాల సందర్భంగా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా ఈడీని అడ్డుకోవాలని కోరుతూ రిట్‌ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్లు జస్టిస్‌ సువ్ర ఘోష్‌ ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. అయితే, కోర్టు గది తీవ్ర రసాభాసగా మారిపోవడంతో జస్టిస్‌ ఘోష్‌ విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు.

డ్రామాలు మమతకు అలవాటేనన్న బీజేపీ

ఈడీ తనిఖీల సమయంలో సీఎం మమత ప్రవర్తించిన తీరును బీజేపీ తప్పుపట్టింది. తనిఖీలు చేస్తున్న ఈడీ అధికారుల నుంచి పత్రాలను లాక్కెళ్లిపోవడం చూస్తుంటే ఆమెపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ప్రతి ఎన్నిక ముందు ఆమె ఇలాంటి డ్రామాలే చేస్తుంటారని ఎద్దేవా చేశారు. కోల్‌కతాలో ర్యాలీ కూడా డ్రామా అని అన్నారు. అటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments