
తిరుమలలో పర్యావరణ పరిరక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న టీటీడీ.. కొండపై పరిశుభ్రతను మరింత బలోపేతం చేసేందుకు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. భక్తులు రోజూ పెద్ద ఎత్తున వినియోగించే టెట్రా ప్యాక్‌లు, టిన్‌లలోని పానీయాల బాటిళ్లు, కూల్ డ్రింక్ ప్యాక్‌లు ఎక్కడ పడితే అక్కడ పారేయడం వల్ల తిరుమల అడవులు, దేవస్థానం పరిసరాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో సరికొత్త రిసైక్లింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
గత సెప్టెంబర్‌లో యాత్రికుల వసతి సముదాయం PAC-05 వద్ద ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రెక్లైమ్ డిపాజిట్ రీఫండ్ మెషిన్లు భక్తులలో భారీ ప్రచారం పొందాయి. ఈ యంత్రాలలో టెట్రాప్యాక్‌లు, ఉపయోగించిన టిన్‌లను వేసిన వెంటనే ప్రతి భక్తుడికి రూ.5 రీఫండ్ రూపంలో తిరిగి రావడం వల్ల భక్తులు స్వచ్ఛందంగా ఇవి వినియోగించసాగారు. పర్యావరణాన్ని కాపాడడం, తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుని తీసుకున్న ఈ చర్యకు రికార్డు స్థాయిలో స్పందన రావడం టీటీడీని మరిన్ని యంత్రాలను తిరుమల అంతటా ఏర్పాటు చేయాలని ప్రేరేపించింది.
పద్మావతి అతిథి గృహంలో తిరుమల పరిశుభ్రత, రిసైక్లింగ్ విధానాలపై జరిగిన సమీక్ష సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి అధికారులకు కీలక సూచనలు చేశారు. టెట్రాప్యాక్‌లు, టిన్‌లను ఎక్కడ పడితే అక్కడ పారేయడం తిరుమలకు ప్రధాన సమస్యగా మారిందని, ప్రతి భక్తుడు బాధ్యతగా వ్యవహరించేందుకు ప్రోత్సహించేలా రీఫండ్ ఆధారిత రిసైక్లింగ్ వ్యవస్థ చాలా ప్రభావవంతంగా ఉన్నదని చెప్పారు. PAC-05లో మిషన్లు మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో.. తిరుమలలోని ఇతర ముఖ్య ప్రదేశాల్లో కూడా వీటిని త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భక్తులకు అవగాహన కల్పించడంలో వ్యాపారులు, టెట్రాప్యాక్ డీలర్లు కూడా భాగస్వామ్యం కావాలని అదనపు ఈవో స్పష్టం చేశారు. స్వచ్ఛ తిరుమల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, తిరుమలలో మిషన్ల ఏర్పాటు ఒక పర్యావరణ ఉద్యమం రూపంలో కొనసాగాలని ఆయన సూచించారు. దేవస్థానం పరిసరాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడానికి రాబోయే నెలల్లో మరిన్ని రిసైకిల్ మెషిన్లు అమలు చేస్తామని, భక్తులందరికీ ఈ విధానం సులభంగా అర్థమయ్యేలా ప్రచార కార్యక్రమాలు చేపడతామని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వో ఫణి కుమార్ నాయుడు, డిప్యూటీ ఈవోలు సోమన్నారాయణ, వెంకటేశ్వర్లు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, రిసైకిల్ కంపెనీ ప్రతినిధులు కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Love Trap: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం, ఆపై మరో ఇద్దరూ..





