
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్.. మూడక్షరాల ఈ పార్టీలో… ఇప్పుడు మూడు ముక్కలాట జరుగుతోంది. పార్టీలో ఆధిపత్యం కోసం మూడు వర్గాలు మధ్య కొట్లాడ జరుగుతోంది. అలాంటిది ఏమీ లేదని… పార్టీ కీలక నేతలు కొట్టిపారేస్తున్నా… మనసులో ఏదో ఉందనే వారి మాటలను బట్టే అర్థమవుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత… ఇటీవల ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు… గులాబి పార్టీకి ముళ్లులా గుచ్చుకుంటున్నాయి. పదేళ్లలో సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదన్న ఆమె ఆరోపణ… పరోక్షంగా బీఆర్‌ఎస్‌పైనే అన్నది వాస్తవం. కొందమంది తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు కవిత. కంటతడి పెట్టుకున్నారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత… బీఆర్‌ఎస్‌లో సొంత వాళ్లే తమను దూరం పెడుతున్నారన్న బాధ ఆమెలో ఉంది. అందుకే… సామాజిక తెలంగాణ అజెండా ఎత్తుకున్నారు కవిత. ఈ క్రమంలో సొంత పార్టీపైనే ఆమె విమర్శలు చేయడం… నియోజకవర్గంలో మీటింగ్‌లకు బీఆర్‌ఎస్ నేతలను పిలవకపోవడంతో… ఆమె వేరు కుంపటి పెడుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారానికి ఎప్పటి కప్పుడు తన విమర్శలతో ఆజ్యం పోస్తూనే ఉన్నారు కవిత.
ఇక… బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తర్వాత కీలక నేతలు కేటీఆర్, హరీష్‌రావు.. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉందని ఎప్పటి నుంచో నడుస్తున్న వార్త. కానీ.. ఎప్పటికప్పుడు అదేమీ లేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు కేటీఆర్, హరీష్‌రావు. ఇప్పుడు మరోసారి.. కేటీఆర్, హరీష్‌రావు మధ్య పంచాయతీ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ పంచాయతీ ఎంతవరకు వెళ్లిందంటే… హరీష్‌రావు మీడియా ముందుకొచ్చి… కేటీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేసినా… తాను పార్టీ మారనను అని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
వాస్తవానికి… బీఆర్‌ఎస్‌లో కేటీఆర్ కంటే హరీష్‌రావే సీనియర్ నాయకుడు. ఉద్యమం సమయంలో పార్టీలో కీలక పాత్ర పోషించారు. కేసీఆర్‌గా అండదండగా ఉన్నారు. కేటీఆర్.. బీఆర్‌ఎస్‌లోకి వచ్చాక.. హరీష్‌రావుతో ఈక్వల్‌గా ఎదిగారు. కేసీఆర్ కుమారుడు కావడంతో.. ఆయనకు హరీష్‌రావు కంటే కొంచెం ఎక్కువ ప్రాధాన్యతే లభిస్తూ వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ… కేటీఆర్ అన్నీ తానై చూసుకునేవారు. అలా అనే కంటే… ఒక షాడో సీఎంగా వ్యవహరించారంటే ఇంకా కరెక్ట్‌గా ఉంటుంది. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్ ప్రాధాన్యత, బలం పెరుగుతున్న కొద్దీ… హరీష్‌రావు పార్టీ మార్పు వార్తలు ఊపందుకున్నారు. హరీష్‌రావు వర్గం కేసీఆర్ పార్టీని వీడి… మరో పార్టీలో చేరుతారన్న ప్రచారం.. ఇప్పటికి చాలా సార్లు జరిగింది. అయితే.. ఆ పరిస్థితి రాకుండా… కేసీఆర్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఈ మధ్యన… కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో… మరోసారి హరీష్‌రావు ప్రస్తావన వచ్చింది. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ బాధ్యతు అప్పగిస్తే.. హరీష్‌రావు వర్గం పార్టీ మారడం ఖాయమన్న వార్త హల్‌చల్ చేసింది. దీంతో.. హరీష్‌రావు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ విషయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని హరీష్‌రావు స్పష్టంగా చెప్పారు. అంతేకాదు.. కేటీఆర్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా తనకు ఓకే అనేశారు. బీఆర్‌ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవని… తాను పార్టీ మారుతానని వస్తున్న వార్తలన్నీ అసత్య ప్రచారాలే అని కొట్టిపారేశారు. హరీష్‌రావు పైకి అలా మాట్లాడుతున్నా… లోపల గూఢార్థం ఏదో ఉందని విశ్లేషకుల భావన.