అంతర్జాతీయంవైరల్

ఇదేం శాపంరా బాబు!.. ‘ఈ గ్రామంలో 60 ఏళ్లుగా మరుగుజ్జులు మాత్రమే పుడుతున్నారు’

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న యాంగ్సీ అనే గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఒక వింత గ్రామంగా గుర్తింపు పొందింది.

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న యాంగ్సీ అనే గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఒక వింత గ్రామంగా గుర్తింపు పొందింది. బయటకు చూస్తే సాధారణ గ్రామంలాగే కనిపించినా.. ఈ గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ నివసించే వారిలో సగానికి పైగా మంది మరుగుజ్జులే. పుట్టుకలో ఎలాంటి లోపాలు లేకపోయినా.. చిన్నప్పటి నుంచి సాధారణంగానే ఎదిగినా.. ఒక దశకు వచ్చేసరికి వారి ఎత్తు పెరగడం పూర్తిగా ఆగిపోతుంది. దీంతో ఈ గ్రామం అసలు పేరుకంటే మరుగుజ్జుల గ్రామంగా ఎక్కువగా ప్రసిద్ధి చెందింది.

యాంగ్సీ గ్రామంలో పిల్లలు సాధారణ పిల్లల్లాగే ఆరోగ్యంగా పుడతారు. పుట్టిన తర్వాత 5 నుంచి ఏడేళ్ల వయస్సు వరకు వారి శరీర వృద్ధి కూడా సాధారణంగానే ఉంటుంది. ఎత్తు, బరువు అన్నీ మిగతా పిల్లల్లాగే పెరుగుతాయి. కానీ ఆ వయస్సు దాటిన తర్వాత ఒక్కసారిగా వారి ఎదుగుదల ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా, ఎంత ఆహారం తీసుకున్నా, మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగరని గ్రామస్తులు చెబుతున్నారు. కొందరి ఎత్తు 2 అడుగులకే పరిమితమవుతుండగా, మరికొందరు 3 అడుగుల వరకే ఎదుగుతున్నారు.

ఈ పరిస్థితి కారణంగా యాంగ్సీ గ్రామస్తులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. అందరిలా తామూ పొడవుగా ఉండాలనే కోరిక వారికి ఉంది. కానీ అది కలగానే మిగిలిపోతోంది. తాము ఏదో శాపగ్రస్తులమని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని చాలామంది నమ్ముతున్నారు. గ్రామంలో ఏదో దుష్టశక్తి ఉందని, అదే తమ ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తోందని తరతరాలుగా విశ్వసిస్తున్నారు. ఈ నమ్మకం ఇప్పటికీ అక్కడ బలంగా కొనసాగుతోంది.

యాంగ్సీ గ్రామం పురాతన కాలం నుంచే శాపగ్రస్త గ్రామమనే పేరు తెచ్చుకుంది. ఈ ప్రాంతంలోకి వెళ్లేందుకు, అక్కడ నివసించేందుకు గతంలో చాలామంది భయపడేవారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అయితే కాలక్రమేణా శాస్త్రీయ దృష్టితో ఈ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఈ మరుగుజ్జుతనానికి అసలు కారణం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలు చేపట్టారు.

కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ చైనా వైపు విడుదల చేసిన విష వాయువుల ప్రభావం వల్లే ఈ గ్రామంలో ఇలాంటి సమస్య తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ కాలంలో వాతావరణంలో కలిసిన విష పదార్థాలు నేలలోకి చేరి, తరతరాలుగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపాయని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు మాత్రం లభించలేదు.

ఇంకొందరు శాస్త్రవేత్తలు యాంగ్సీ గ్రామంలోని నేల, నీరు, మొక్కలు, పంటలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో భాగంగా గ్రామ మట్టిలో పాదరసం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. పాదరసం వంటి లోహాలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇక్కడి ప్రజల ఎత్తు పెరగకపోవడానికి ఇది ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు.

అయితే ఈ వాదన కూడా ఇప్పటివరకు పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఎందుకంటే పాదరసం ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రతిచోటా ఇలాంటి సమస్య కనిపించడం లేదు. మరోవైపు, గ్రామస్తుల మాటల ప్రకారం సుమారు 20 ఏళ్ల క్రితం యాంగ్సీ గ్రామంలో ఒక విచిత్రమైన వ్యాధి వ్యాపించిందట. ఆ వ్యాధి ప్రధానంగా 5 నుంచి ఏడేళ్ల వయస్సు గల పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసిందని చెబుతున్నారు. ఆ వ్యాధి వచ్చిన పిల్లల ఎదుగుదల అక్కడితో ఆగిపోయిందని గ్రామ పెద్దలు గుర్తు చేస్తున్నారు.

ఆ కాలంలో ఆ వ్యాధి సోకిన పిల్లలు పెద్దవారైన తర్వాత కూడా 3 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు గ్రామంలో ముసలివారు, యువకులు, పిల్లలు అందరూ దాదాపు ఒకే ఎత్తులో కనిపిస్తున్నారు. ఇది యాంగ్సీ గ్రామాన్ని మరింత వింతగా మార్చింది. ఈ సమస్యకు ఖచ్చితమైన శాస్త్రీయ కారణం ఇప్పటికీ తెలియకపోవడం వల్ల, యాంగ్సీ గ్రామం ప్రపంచంలోని అతిపెద్ద రహస్య గ్రామాల్లో ఒకటిగా మిగిలిపోయింది.

ALSO READ: ‘బతకండి.. బతకనీయండి’: విజయ్ దేవరకొండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button