
దానిమ్మను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండుగా చాలామంది భావిస్తారు. నిజానికి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అయితే ప్రతి ఆహారం అందరికీ ఒకేలా మేలు చేయదన్న సత్యాన్ని దానిమ్మ విషయంలోనూ గుర్తించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు దానిమ్మను తీసుకోవడం వల్ల లాభం కన్నా నష్టం కలగవచ్చని స్పష్టం చేస్తున్నారు.
దానిమ్మలో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. సాధారణంగా హైబీపీ ఉన్నవారికి ఇది ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఇప్పటికే లో బీపీ సమస్యతో బాధపడుతున్న వారు దానిమ్మను అతిగా తీసుకుంటే రక్తపోటు మరింత పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా జరగడం వల్ల తలనిర్బంధం, నీరసం, చక్కర్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇక కొన్ని రకాల మందులు వాడుతున్నవారు కూడా దానిమ్మ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ACE ఇన్హిబిటర్స్, స్టాటిన్స్, బీటా బ్లాకర్స్ వంటి మందులు తీసుకునే వారు దానిమ్మను తీసుకుంటే వాటి ప్రభావం మారిపోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మలోని కొన్ని సమ్మేళనాలు ఈ మందులతో పరస్పర చర్యకు వెళ్లి సైడ్ ఎఫెక్ట్స్‌కు కారణమయ్యే ప్రమాదం ఉంది.
శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారికి కూడా దానిమ్మ సరైన ఆహారం కాదని నిపుణులు సూచిస్తున్నారు. దానిమ్మ రక్తపోటుపై ప్రభావం చూపడమే కాకుండా రక్తం గడ్డకట్టే ప్రక్రియపై కూడా ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. అందువల్ల ఏదైనా ఆపరేషన్‌కు కనీసం రెండు వారాల ముందే దానిమ్మను ఆహారంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడం మంచిదని వైద్యుల సూచన.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారికి దానిమ్మ మరిన్ని ఇబ్బందులు కలిగించవచ్చు. దానిమ్మలో ఉండే ఫైబర్ కొంతమందిలో కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలను పెంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే అలెర్జీ సమస్యలు ఉన్నవారిలో దానిమ్మ తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.
కాబట్టి దానిమ్మ ఆరోగ్యానికి మంచిదనే భావనతో అందరూ విచక్షణ లేకుండా తీసుకోవడం సరికాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తమ ఆరోగ్య పరిస్థితి, వాడుతున్న మందులు, ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకుని మాత్రమే దానిమ్మను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని నిపుణుల అభిప్రాయం.
ALSO READ: ప్రియుడితో వెళ్లిపోతానని భర్తకు చెప్పిన భార్య, ఆపై ఘోరం





