
మన రోజువారీ జీవితంలో వంటగది ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తాం. కుటుంబ ఆరోగ్యం మొత్తం వంటిల్లిపైనే ఆధారపడి ఉంటుందన్నది ఎవరూ కాదనలేని నిజం. కానీ అదే వంటగదిలో మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీసే అంశాలు దాగి ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంటగది శుభ్రంగా లేకపోతే కడుపు కూడా శుభ్రంగా ఉండదన్న మాట కేవలం నానుడి మాత్రమే కాదు.. దాని వెనుక బలమైన ఆరోగ్య శాస్త్రం ఉందని చెబుతున్నారు. వంటింట్లో ఉపయోగించే కొన్ని సాధారణ వస్తువులే కాలక్రమేణా ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ప్రత్యేకించి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో వంటగదిలోని కొన్ని ఉత్పత్తులకు నేరుగా సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజూ వాడే పాత్రలు, నిల్వ చేసే డబ్బాలు, తినే ఆహార పదార్థాలే మన శరీరంలో విషపదార్థాలు చేరేందుకు కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అందుకే వంటింట్లో ఏం వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం అనే విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ప్రతి ఇంట్లోనూ విరివిగా కనిపిస్తున్న నాన్ స్టిక్ వంటసామాగ్రి ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని నిపుణుల హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఆహారం అంటుకోకుండా ఉండేందుకు వీటిపై వేసే ప్రత్యేక రసాయన పూతలో హానికరమైన పదార్థాలు ఉంటాయని చెబుతున్నారు. అధిక వేడి మీద నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగించినప్పుడు వాటి నుంచి విడుదలయ్యే రసాయనాలు ఆహారంలో కలిసిపోతాయని, దీని వల్ల శరీరంలో విషపదార్థాలు చేరతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీర్ఘకాలంగా ఈ ప్రభావం కొనసాగితే క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే వంటగదిలో విస్తృతంగా ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లు కూడా ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు. ముఖ్యంగా ఆహారాన్ని నిల్వ చేయడానికి, వేడి చేయడానికి వాడే ప్లాస్టిక్ డబ్బాల్లో బిస్ఫెనాల్ ఏ అనే రసాయనం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ రసాయనం శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయడమే కాకుండా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని వైద్యుల అభిప్రాయం. దీర్ఘకాలంగా ఈ రసాయన ప్రభావానికి గురైతే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చోటు దక్కించుకున్న శుద్ధి చేసిన చక్కెర కూడా ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది. తీపి కోసం అధికంగా వాడుతున్న ఈ చక్కెర శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు దోహదపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిరంతరం శుద్ధి చేసిన చక్కెరను తీసుకోవడం వల్ల మెటబాలిజం దెబ్బతినడమే కాకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తులు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అంశాల జాబితాలో ఉన్నాయి. సాసేజ్‌లు, హామ్, ప్రాసెస్ చేసిన చికెన్ లేదా మటన్ వంటి ఆహారాలు రుచికరంగా అనిపించినా, వీటిలో ఉండే రసాయనాలు శరీరానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
నేటి బిజీ జీవనశైలిలో చాలామంది డబ్బాల్లో రెడీగా లభించే ఆహారాలపై ఆధారపడుతున్నారు. కానీ ఈ డబ్బాల లోపలి పొరలో ఉండే బిస్ఫెనాల్ ఎ అనే రసాయనం ఆహారంలోకి లీక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారాన్ని వేడి చేసినప్పుడు లేదా ఆమ్ల పదార్థాలతో కలిపినప్పుడు ఈ రసాయనం ఎక్కువగా విడుదలవుతుందని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
మొత్తానికి వంటగదిలో మనం ఉపయోగించే ప్రతి వస్తువు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నది విస్మరించలేని నిజం. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు సహజమైన పాత్రలు, గాజు లేదా స్టీల్ కంటైనర్లు, తాజా ఆహార పదార్థాలను ఉపయోగించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన వంటగది మాత్రమే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ALSO READ: 14 ఏళ్ల బాలికకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం.. ఆపై మరో ఘోరం





