
కర్ణాటకలో ఓ మహిళ వ్యవహారం సంచలనంగా మారింది. ఒకరి తర్వాత ఒకరిని వివాహం చేసుకుంటూ, చివరికి ఇద్దరు భర్తలు ఒకే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. బెంగళూరు రూరల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. నిత్యం పెళ్లి కూతురిలా మారుతూ, కొత్త జీవితం అంటూ మోసాలకు పాల్పడిన ఈ మహిళ కథ పోలీసులకే షాక్ ఇచ్చేలా మారింది.
బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్లాపూర్ తాలూకా పరిధిలోని కుప్పన్ గ్రామానికి చెందిన సుధారాణి కొన్నేళ్ల క్రితం వీరేగౌడ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదట కుటుంబ జీవితం సాఫీగానే సాగింది. అయితే కాలక్రమంలో భర్త వీరేగౌడపై అసంతృప్తి పెంచుకున్న సుధారాణి, అతడికి కారు, బుల్లెట్ బైక్ నడపడం రాదనే కారణాన్ని చూపిస్తూ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆశ్చర్యకరంగా ఇద్దరు పిల్లలను కూడా భర్త వద్దే వదిలేసింది.
అక్కడితో ఆగని ఆమె మరో అడుగు ముందుకేసింది. ఓ డెలివరీ బాయ్ అనంతమూర్తితో పరిచయం పెంచుకుని, అతడిని ప్రేమలోకి దింపింది. తన మొదటి భర్త చనిపోయాడని అబద్ధం చెప్పి, ఒంటరిగా ఉన్నానని నమ్మబలికింది. తనకు తోడు కావాలని, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అనంతమూర్తి ఆమె మాటలను నమ్మాడు. చివరికి ఇద్దరూ ఓ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
రెండో భర్తగా మారిన అనంతమూర్తి నుంచి సుధారాణి దాదాపు రూ.20 లక్షల వరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. వివిధ అవసరాలు, వ్యాపారం పేరుతో ఆ మొత్తాన్ని తన ఖాతాలోకి మళ్లించుకుంది. డబ్బు అందుకున్న తర్వాత మాత్రం ఆమె ప్రవర్తన మారిపోయింది. క్రమంగా అనంతమూర్తిని దూరం పెట్టి, పూర్తిగా కట్ చేసింది.
ఇదే సమయంలో కర్ణాటకలోని కనకపురానికి చెందిన మరో వ్యక్తితో పరిచయం పెంచుకున్న సుధారాణి, అతడిని కూడా వివాహం చేసుకుని పరారైంది. ఈ పరిణామాలతో ఒక్కసారిగా వ్యవహారం బయటకు వచ్చింది. తన భార్య అదృశ్యమైందంటూ మొదటి భర్త వీరేగౌడ దొడ్డబళ్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కొద్దిసేపటికే రెండో భర్త అనంతమూర్తి కూడా అదే పోలీస్ స్టేషన్‌లో సుధారాణిపై ఫిర్యాదు చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఒకే మహిళపై ఇద్దరు భర్తలు ఫిర్యాదు చేయడంతో కేసు సంచలనంగా మారింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, సుధారాణి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె చేసిన మోసాలు, వివాహాల వెనుక అసలు ఉద్దేశాలు ఏమిటన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.
ALSO READ: తల్లిదండ్రులు, చెల్లిని చంపి.. ఇంట్లోనే పూడ్చిపెట్టాడు!





