Wednesday, March 18, 2026
Homeజాతీయంక్వారీలు అడ్డ‌దారిగా పొందిన‌వే...! ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపించాలి

క్వారీలు అడ్డ‌దారిగా పొందిన‌వే…! ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపించాలి

  • అక్ర‌మ మైనింగ్‌తో వంద‌ల కోట్ల దోపిడి

  • ప్ర‌భుత్వ ఖ‌జాన‌కు భారీ గండి

  • బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం, క్రైమ్ మిర్ర‌ర్‌:  పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.

పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో అనేక సంవత్సరాలుగా సుమారు 10 క్వారీలు, 7 నుండి 8 క్రషింగ్ మిల్లులు నడుస్తున్నాయని తెలిపారు. ఈ క్వారీలు అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం నుండి అనుమతులు పొంది కొందరు దళారులు వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమ మైనింగ్ అంశంపై భారతీయ జనతా పార్టీ గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేస్తూ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు.

ఈ క్రమంలో గనుల శాఖ నిర్వహించిన ఈటీఎస్‌ సర్వేలో తోగ్గూడెం ప్రాంతంలో సుమారు 50 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా అక్రమ తవ్వకాలు జరిగినట్లు అధికార రికార్డులు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. మైన్స్ అండ్ జియాలజీ శాఖ విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం తోగ్గూడెం ప్రాంతంలోని పలువురు క్వారీ లీజ్ హోల్డర్లపై ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లకు పైగా డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

అయితే ఈ భారీ జరిమానాలను చెల్లించకుండా కొన్ని క్వారీలు రోజువారీగా అక్రమంగా తవ్వకాలు కొనసాగిస్తూ క్రషింగ్ మిల్లులు నడుపుతున్నాయని ఆయన విమర్శించారు. సంవత్సరాలుగా అక్రమంగా ఖనిజాన్ని తవ్వడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయ నష్టం జరుగుతోందని తెలిపారు.

ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌భావం…

తోగ్గూడెం ప్రాంతంలో అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, మైన్స్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే ప్రభుత్వానికి రావలసిన బకాయిలను వెంటనే వసూలు చేయాలని, ఇన్ని సంవత్సరాలుగా కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం అక్రమంగా నడుస్తున్న క్వారీలు మరియు క్రషింగ్ మిల్లుల అనుమతులను రద్దు చేసి ప్రజల అవసరాల నిమిత్తం ఆ ప్రాంత గిరిజనులకే కొత్త అనుమతులు ఇచ్చి మైనింగ్ నిబంధనల ప్రకారం కంకర సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ అంశంపై ప్రభుత్వం వెంట‌నే స్పందించాల‌ని లేని యెడల భారతీయ జనతా పార్టీ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నోముల రమేష్,గోడుగు శ్రీధర్ యాదవ్,శీలం విద్యాసాగర్ (కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు),కాల్వ ప్రసాద్,శ్రీనివాస్, మాదారపు లక్ష్మణ్,లింగగిరి వెంకట్రామయ్య ,భూక్య మోహన్,భూక్య ఆశ,కోటేశ్వరావు,పవన్,కొత్తపల్లి విజయ్,బానోత్ బాలాజీ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments