
ప్రపంచవ్యాప్తంగా బంగారం అంటే విలువ, భద్రత, సంపదకు చిహ్నం. భారత్‌లో అయితే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక గ్రాము బంగారం కొనాలంటే వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. కానీ దీనికి పూర్తిగా భిన్నమైన దృశ్యం దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశంలో కనిపిస్తోంది. అక్కడ బంగారం ధర ఒక కప్పు టీ ధరకంటే కూడా తక్కువగా ఉండటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వినడానికి నమ్మశక్యం కాకపోయినా ఇది అక్కడి వాస్తవ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రస్తుతం భారత్‌లో 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు సుమారు రూ.13,800కి పైగా కొనసాగుతోంది. అదే సమయంలో వెనిజులాలో మాత్రం అదే 24 క్యారెట్ బంగారం భారత కరెన్సీ లెక్కన కేవలం రూ.181కే లభిస్తోంది. ఇక 22 క్యారెట్ బంగారం ధర మరింత దిగజారి రూ.166 వరకు పడిపోయింది. ఈ ధరలు అక్కడి ప్రజలకు ఆనందం కలిగించాల్సినవిగా కనిపించినా.. వాస్తవానికి ఇవి దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత దయనీయ స్థితిలో ఉందో చెప్పే భయంకరమైన సంకేతాలుగా మారాయి.
వెనిజులాలో బంగారం ఇంత చౌకగా కనిపించడానికి ప్రధాన కారణం అక్కడి కరెన్సీ పతనం. వెనిజులన్ కరెన్సీ అయిన ‘బోలివర్’ గత కొన్నేళ్లుగా తీవ్ర విలువ కోల్పోయింది. విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా రోజురోజుకు డబ్బుకు విలువ లేకుండా పోతోంది. ప్రజలు చేతిలో పట్టుకున్న నోట్లతో నిత్యావసరాలు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్థానిక కరెన్సీలో బంగారం ధరలు పెరిగినప్పటికీ, అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే అవి అతి తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ప్రపంచానికి వెనిజులాలో బంగారం అత్యంత చౌకగా ఉన్నట్లు అనిపిస్తోంది.
వెనిజులా ఆర్థిక పతనానికి మరో ప్రధాన కారణం దేశ బంగారు నిల్వల భారీ తగ్గుదల. అంతర్జాతీయ కథనాల ప్రకారం నికోలస్ మదురో పాలన కాలంలో వెనిజులా ప్రభుత్వం పెద్ద ఎత్తున బంగారు నిల్వలను విదేశాలకు తరలించింది. ముఖ్యంగా 2013 నుంచి 2016 మధ్యకాలంలో సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారం స్విట్జర్లాండ్‌కు పంపినట్లు నివేదికలు వెల్లడించాయి. అప్పులు తీర్చడం, ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడం కోసం ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్‌ను విచ్చలవిడిగా వినియోగించుకుంది.
ఈ నిర్ణయాల ప్రభావం దేశ భవిష్యత్తుపై తీవ్రంగా పడింది. ఒకప్పుడు భారీ బంగారు నిల్వలు కలిగిన వెనిజులా, 2024 నాటికి అధికారికంగా కేవలం 161 టన్నుల బంగారంతోనే పరిమితమైంది. ఇది అంతర్జాతీయంగా దేశ ఆర్థిక విశ్వసనీయతను మరింత దెబ్బతీసింది. ఫలితంగా పెట్టుబడులు తగ్గిపోయాయి, దిగుమతులు కష్టమయ్యాయి, ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయి.
వాస్తవానికి వెనిజులా పేద దేశం కాదు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాల్లో ఇది ఒకటి. ప్రపంచ క్రూడ్ ఆయిల్ నిల్వల్లో సుమారు 17 శాతం వెనిజులా వద్దే ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. అంతేకాదు ‘ఒరినోకో మైనింగ్ ఆర్క్’ ప్రాంతంలో 8,000 టన్నులకుపైగా బంగారం, వజ్రాలు, బాక్సైట్ వంటి విలువైన ఖనిజ సంపద ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
అయినా సరైన ఆర్థిక విధానాలు లేకపోవడం, విపరీతమైన అవినీతి, పాలనా వైఫల్యాలు దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. సహజ వనరుల్ని సమర్థంగా వినియోగించుకోలేకపోవడం వల్ల ప్రజలకు సంపద ప్రయోజనం చేకూరలేదు. 2024 నాటికి వెనిజులా అధికారిక బంగారం ఉత్పత్తి కేవలం 30.6 టన్నులకే పరిమితమైంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా మారిందో స్పష్టంగా తెలియజేస్తోంది.
ఒకప్పుడు లాటిన్ అమెరికాలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ఉన్న వెనిజులా.. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాల్లో ఒకదాన్ని ఎదుర్కొంటోంది. ఒక కప్పు టీ ధరకే బంగారం లభిస్తోందన్న వార్త ఆశ్చర్యం కలిగించినా, అది అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలకు, దేశ పతనానికి ప్రతీకగా నిలుస్తోంది.
ALSO READ: భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య!





