కాళేశ్వరం నీళ్లు వాడుకుంటరు ప్రాజెక్టును బద్నాం చేస్తరు
రైతులకు రైతుబందు సకాలంలో ఇవ్వండి
సీఎం తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
కరీంనగర్,క్రైమ్ మిర్రర్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భూతులు రైతులకు కడుపు నింపవని, సకాలంలో రైతలకురైతు బందు ఇవ్వాలని బీఆర్ ఎస్ మాజీ మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పర్యటనలో భాగంగా కురిక్యాల వద్ద కొండన్నపల్లి వరద కాలువను మాజీ మంత్రి హరీశ్ రావు గారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారన్నారు.
కాలువలో పారుతున్న నీరు కాళేశ్వరం ప్రాజెక్టువి కావా అని ప్రశ్నించారు. ప్యాకేజీ 6, ప్యాకేజీ 8 కింద మోటార్లు పెట్టి, టన్నెల్స్ పనులు పూర్తి చేసి, వరద కాలువను ఒక రిజర్వాయర్‌గా మార్చి.. చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాని తెలిపారు. కాళేశ్వరం నీళ్లతోనే రైతులు పంటు పండించుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం హోదాలో మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. అందులో 100 కంపోనెంట్లు ఉన్నాయి. 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు.. ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం ప్రాజెక్టు అని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. 2022 సంవత్సరంలోనే దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండున్నరేళ్లలో ఒక్క కాలువ తవ్వలేదు, ఒక్క చెక్ డ్యాం నిర్మించలేదు, ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. కనీసం కాలువల తవ్వకానికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, స్థానిక మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు ఉన్నారు
