
ఒకప్పుడు ప్రేమ, స్నేహం, అనుబంధాలు అన్నీ మనసుకు సంబంధించిన సహజ భావాలుగా భావించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు మానవ సంబంధాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నగర జీవితం మానవ అనుబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రేమ అనేది ఇక కేవలం భావోద్వేగాలకు పరిమితమై ఉండడం లేదని, పరిస్థితులు, సమయం, పని ఒత్తిళ్లు, జీవనశైలి వంటి అంశాలు సంబంధాల్ని నిర్ధారిస్తున్నాయని థ్రైవింగ్ సెంటర్ ఆఫ్ సైకాలజీ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, మెట్రో నగరాల్లో ప్రేమ, స్నేహం, డేటింగ్ వంటి సంబంధాలు పూర్తిగా భిన్నంగా మారుతున్నాయి. సౌకర్యాలు పెరిగినా, టెక్నాలజీ అభివృద్ధి అయినా, మనుషుల మధ్య భావోద్వేగ అనుబంధం మాత్రం తగ్గుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం, కెరీర్‌కు ఇచ్చే అధిక ప్రాధాన్యం, ఉద్యోగ భద్రతపై ఉన్న ఒత్తిళ్లు ప్రేమానురాగాలను పూర్తిగా ఆస్వాదించనివ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం, ప్రమోషన్, ఆర్థిక భద్రత అనే లక్ష్యాలతో ముందుకు వెళ్లే యువతకు వ్యక్తిగత జీవితానికి కేటాయించేందుకు సమయం మిగలడం లేదు. కుటుంబంతో గడపాల్సిన సమయం, స్నేహితులతో మమేకమయ్యే క్షణాలు, చిన్న చిన్న ఆనందాలు కూడా నగర జీవనంలో అరుదుగా మారుతున్నాయి. సర్వేలో పాల్గొన్న 900 మందికిపైగా సింగిల్ అడల్ట్స్‌లో ఎక్కువమంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు నిపుణులు తెలిపారు.
ప్రేమ, స్నేహం తగ్గడానికి ఆసక్తి లేమే కారణమని కాదు కానీ.. వాటిని నిలబెట్టుకునే సమయం లేకపోవడమే అసలు సమస్యగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రోజంతా పని ఒత్తిడి, ట్రాఫిక్, స్క్రీన్‌ల ముందు గడిపే గంటలు మానవ సంబంధాలకు దూరం చేస్తున్నాయి. ఈ పరిస్థితులు కొన్నిసార్లు అపార్థాలకు, నమ్మకం లోపించడానికి, విభేదాలకు కూడా దారి తీస్తున్నాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ, భారత్‌లో ఇప్పటికీ కొంతమేర కుటుంబ విలువలు నిలిచే ఉన్నాయని, కానీ న్యూయార్క్ వంటి పెద్ద నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని సర్వేలు సూచిస్తున్నాయి.
డేటింగ్ సంస్కృతి కూడా మార్పుల దశలో ఉందని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు డేటింగ్ యాప్‌లు యువతలో ఉత్సాహాన్ని కలిగించేవి. కానీ ఇప్పుడు జీవన వ్యయం పెరగడం, సోషల్ బర్న్ అవుట్, భావోద్వేగ అలసట వంటి కారణాలతో డేటింగ్‌పై ఆసక్తి తగ్గుతోంది. డేటింగ్ అనేది లోతైన అనుబంధాలకు దారి తీసే మార్గంగా కాకుండా, తాత్కాలిక పరిచయంగా మారుతోందన్న భావన పెరుగుతోంది. దీంతో చాలా మంది యువత డేటింగ్ యాప్‌ల నుంచి క్రమంగా దూరమవుతున్నారు.
వేగవంతమైన జీవన శైలి, అధిక ఖర్చులు, కెరీర్‌కే పరిమితమయ్యే ఆలోచనలు మానవ సంబంధాలను పెంపొందించడంలో పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. ప్రేమ, స్నేహం వంటి బంధాలకు సమయం, శ్రద్ధ, భావోద్వేగ నిబద్ధత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నగర జీవితం ఎంత ఆధునికంగా మారినా, మానవ సంబంధాలకు విలువ ఇవ్వకపోతే ఒంటరితనం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మానవ సంబంధాలను కాపాడుకోవాలంటే జీవన వేగాన్ని కొంత తగ్గించుకోవడం, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత సాధించడం అవసరమని నిపుణుల సూచన. ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు మన మానసిక ఆరోగ్యానికి అత్యంత అవసరమని, వాటికి సమయం కేటాయించడమే నిజమైన అభివృద్ధి అని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ALSO READ: ‘నా భర్త మగాడు కాదు’.. హనీమూన్ నుంచి వచ్చి నవ వధువు షాకింగ్ నిర్ణయం





