
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
కాంగ్రెస్‌లో మార్పు మొదలైందా…? రాష్ట్రాలకు, ముఖ్యమంత్రులకు స్వేచ్ఛ ఇస్తుందా…? అంటే నిజమే అనిపిస్తోంది. ఇటీవల జరిగిన CWC సమావేశాల్లో ఈ ప్రతిపాదన తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. జిల్లా అధ్యక్షులకు కూడా పవర్ ఇస్తామని ప్రకటించారు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. అన్నట్టుగానే పార్టీలో మార్పు చూపిస్తున్నారా..? ఆ మార్పు.. తెలంగాణ నుంచే మొదలైందా…? అంటే.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాటే నిదర్శనంగా నిలుస్తోంది.
తెలంగాణ కేబినెట్ విస్తరణ విషయం ఫైనల్ నిర్ణయం సీఎం రేవంత్‌రెడ్డిదే అని మీనాక్షి అన్నారు. అంతా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని చెప్పారామె. అంటే… కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టే అనుకోవాలి. ఇంతకు ముందు పార్టీలో ఈ పరిస్థితి లేదు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నా…. చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా… హస్తిన ఫ్లైట్ ఎక్కాల్సిందే. అగ్రనేతలతో చర్చించాల్సిందే. వారు చెప్పిన వారిని ఫైనల్ చేయాల్సిందే. అయితే… మీనాక్షి నటరాజన్ మాటలతో పార్టీలో మార్పు వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది.
తెలంగాణ కేబినెట్ విస్తరణ విప్పలేని పీటముడిగా మారింది. మంత్రివర్గంలో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో నాలుగింటిని భర్తీ చేయాలని భావించారు. కొందరి పేర్లను కూడా అధిష్టానం ఫైనల్ చేసినట్టు ప్రచారం జరిగింది. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వినోద్ పేర్లు ఉన్నట్టు లీకులు వచ్చాయి. దీంతో… మిగిలిన ఆశావహులు భగ్గుమన్నారు. కొందరు బెదిరింపులకు దిగారు. రాజగోపాల్‌రెడ్డి, వినోద్‌లకు మంత్రి పదవులు ఇస్తే… ఊరుకోమంటూ హెచ్చరించారు కూడా. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో అధిష్టానం చూసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి కూడా చెప్పారు. అయితే… ఈ విషయంలో తాజాగా మీనాక్షి నటరాజన్ స్పందించారు. కేబినెట్ విస్తరణపై నిర్ణయాధికారం సీఎం రేవంత్‌రెడ్డిదే అని చెప్పేశారు. అంటే… దీంతో… నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం రేవంత్‌రెడ్డికి అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టేనా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇది కేబినెట్ విస్తరణ విషయంలోనేనా… లేక… రాష్ట్ర స్థాయిలో అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం రేవంత్‌రెడ్డికి ఇచ్చారా..? అన్నది చూడాలి.