
మధ్యప్రదేశ్‌లో భిక్షాటనకు సంబంధించి బయటపడిన ఓ షాకింగ్ నిజం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండోర్ నగరంలోని ప్రసిద్ధ సరాఫా ప్రాంతంలో సంవత్సరాల తరబడి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ యాచకుడు వాస్తవానికి ధనవంతుడని తేలడంతో అధికారులు కూడా విస్మయానికి గురయ్యారు. వీధుల్లో చెక్క బండి తోసుకుంటూ, వీపు మీద బ్యాగు వేసుకుని, మౌనంగా తిరుగుతూ కనిపించిన ఈ వ్యక్తి వద్ద కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
మంగీలాల్‌గా గుర్తించిన ఈ యాచకుడిని మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న భిక్షాటన నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రెస్క్యూ టీం అదుపులోకి తీసుకుంది. అతడి నేపథ్యాన్ని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బయటికి నిరుపేదగా కనిపించిన మంగీలాల్ వాస్తవానికి మూడు ఇళ్లు, ఒక కారు, మూడు ఆటో రిక్షాలకు యజమానిగా ఉన్నాడు.
సరాఫా ప్రాంతంలో రోజూ కనిపించే మంగీలాల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రజల వద్దకు వెళ్లేవాడు. అతని మౌనం, దయనీయమైన రూపం చూసి చాలా మంది స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చేవారని అధికారులు తెలిపారు. ఈ విధంగా అతడు రోజుకు సగటున 500 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించేవాడని విచారణలో వెల్లడైంది.
భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును కేవలం ఖర్చు చేయకుండా, సరాఫా ప్రాంతంలోని కొంతమంది వ్యాపారులకు అప్పులుగా ఇచ్చేవాడని అధికారులు గుర్తించారు. రోజువారీ, వారపు వడ్డీ విధానంలో డబ్బులు ఇచ్చి, వడ్డీ వసూలు చేసేందుకు ప్రతిరోజూ సరాఫా ప్రాంతానికి వచ్చేవాడని తేలింది. ఈ వ్యవహారం బయటపడడంతో భిక్షాటన వెనుక ఉన్న మరో కోణం వెలుగులోకి వచ్చింది.
రెస్క్యూ టీం నోడల్ ఆఫీసర్ దినేష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం మంగీలాల్‌కు ఇండోర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో మూడు కాంక్రీట్ ఇళ్లు ఉన్నాయి. భగత్ సింగ్ నగర్‌లో 16 బై 45 అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల ఇల్లు, శివనగర్‌లో 600 చదరపు అడుగుల బిల్డింగ్, అల్వాస్ ప్రాంతంలో 10 బై 20 అడుగుల BHK ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. అల్వాస్‌లోని ఇంటిని అతని వైకల్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం రెడ్‌క్రాస్ సహాయంతో అందించినట్లు అధికారులు తెలిపారు.
ఇవే కాకుండా మంగీలాల్‌కు మూడు ఆటో రిక్షాలు కూడా ఉన్నాయి. వాటిని అద్దెకు ఇచ్చి నెలకు మంచి ఆదాయం పొందుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అలాగే డిజైర్ కారు కూడా ఉండగా, దానిని నడపడానికి ప్రత్యేకంగా డ్రైవర్‌ను కూడా నియమించుకున్నట్లు అధికారులు తెలిపారు.
మంగీలాల్ ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి అల్వాస్‌లో నివసిస్తున్నాడు. అతని ఇద్దరు సోదరులు విడివిడిగా ఉంటున్నట్లు గుర్తించారు. ఇండోర్‌ను భిక్షాటన రహిత నగరంగా మార్చే లక్ష్యంతో ఫిబ్రవరి 2024 నుంచి ఈ ప్రత్యేక ప్రచారం ప్రారంభమైందని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రజనీష్ సిన్హా తెలిపారు. ప్రాథమిక సర్వేలో 6,500 మంది బిచ్చగాళ్లను గుర్తించగా, వారిలో 4,500 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి భిక్షాటన నుంచి విముక్తి కల్పించారు. 1,600 మందిని రక్షించి ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి తరలించగా, 172 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు.
భిక్షాటనకు పాల్పడే వారిపై మాత్రమే కాకుండా, దానిని ప్రోత్సహించే వారిపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగీలాల్ ఉదంతం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Pooja Hegde: అసభ్యకరంగా ప్రవర్తించాడు.. ఆ స్టార్ హీరోను కొట్టాను





