జాతీయం

బెంగళూరు తొక్కిసలాట..ఆర్సీబీపై కేసు, సీపీపై వేటు, హైకోర్టు సీరియస్!

Bangalore Stampede: ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్లపై కేసు ఫైల్ అయ్యింది. బెంగళూరు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్‌ 105 సహా ఐదు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని ప్రకటించిన ప్రభుత్వం.. అన్నట్లుగానే చర్యలు చేపట్టింది.

బెంగళూరు సీపీపై వేటు

తొక్కిసలాట ఘటనకు బాధ్యుడిగా చేస్తూ బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ బి.దయానందను సస్పెండ్‌ చేసింది కర్కాటక ప్రభుత్వం. అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌ వికాశ్‌ కుమార్‌, డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ శేఖర్‌పైనా వేటుపడింది. కబ్బన్‌ పార్క్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ సి. బాలకృష్ణ, కబ్బన్‌ పార్క్‌ సీఐ ఏకే గిరీశ్‌ ను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తొక్కిసలాట ఘటన ఈ కేసును సీఐడీకి ఇవ్వాలని కర్నాటక క్యాబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం సిద్దరామయ్య వెల్లడించారు.

సుమోటోగా కేసు తీసుకున్న హైకోర్టు

మరోవైపు తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా తీసుకుంది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ వి.కామేశ్వరరావ్‌, జస్టిస్‌ సీఎం జోషిల ద్విస భ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సభ్యులతో రెండు చోట్ల ఎందుకు సంబరాలు నిర్వహించారని ప్రశ్నించింది. స్టేడియం దగ్గర చేసిన బందోబస్తు ఏర్పాట్లు ఏంటి? అభిమానుల కంట్రోల్ కు తీసుకున్న చర్యలు ఏంటి? అని ప్రశ్నించింది. అంతేకాదు, క్రీడాకారులు ఏ దేశానికి ఆడారని సన్మానం చేశారని ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ శశికరణ నీళ్లు నమిలారు. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ,  తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది కర్నాటక హైకోర్టు.

Read Also: ఐపీఎల్ ఛాంపియన్ గా ఆర్సీబీ, 18 ఏళ్ల నిరీక్షణకు తెర!

Back to top button