Monday, March 2, 2026
HomeతెలంగాణTelangana: హౌస్ లిస్టింగ్‌కు రంగం సిద్ధం.. మే 11 నుంచి జూన్ 9 వరకు జనగణన...

Telangana: హౌస్ లిస్టింగ్‌కు రంగం సిద్ధం.. మే 11 నుంచి జూన్ 9 వరకు జనగణన తొలి దశ

Telangana: తెలంగాణలో జనగణన ప్రక్రియకు సంబంధించిన మొదటి దశ అయిన హౌస్ లిస్టింగ్‌ కార్యక్రమానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర కేబినెట్ హౌస్ లిస్టింగ్ తేదీలను ఖరారు చేయడంతో ప్రక్రియకు మార్గం సుగమమైంది. మే 11 నుంచి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ జనగణన పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో యాప్ ఆధారంగా చేపట్టనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియకు సుమారు 88 వేల మంది సిబ్బంది అవసరం అవుతారని అంచనా వేశారు. 2025 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 621 గ్రామీణ మండలాలు, 9,983 రెవెన్యూ గ్రామాలు, 134 పట్టణాలు ఉన్నట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో కంటోన్‌మెంట్‌లు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని సర్కిల్స్‌ను కూడా లెక్కలోకి తీసుకున్నారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక కోడ్ కేటాయించి, ఆ కోడ్ ఆధారంగా ఎన్యుమరేటర్ల ద్వారా సర్వే నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో ఉపాధ్యాయులు సహా వివిధ శాఖల సిబ్బంది, ఉద్యోగులను వినియోగించుకోవాలని నిర్ణయించారు. సిబ్బంది ఎంపిక బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

హౌస్ లిస్టింగ్ సర్వేపై జాతీయ స్థాయి శిక్షణ ఇప్పటికే పూర్తయింది. 66 మంది మాస్టర్ ట్రైనర్లకు మార్చి 5 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి పూర్తి అవగాహన కల్పించనున్నారు. ఫీల్డ్ లెవల్‌లో సుమారు 1,220 మంది సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. ఏప్రిల్ నాటికి శిక్షణ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జనాభా లెక్కల్లో రెవెన్యూ గ్రామం, పట్టణాల్లో వార్డులను యూనిట్‌గా తీసుకోనున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు సుమారు 800 జనాభా ఉన్న ప్రాంతాన్ని కేటాయించనున్నారు. టెక్నాలజీపై అవగాహన తక్కువగా ఉన్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. హౌస్ లిస్టింగ్ పూర్తయ్యాక రెండో దశగా 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు పూర్తి స్థాయి జనగణన నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు దోహదపడే విధంగా ఈ డేటా కీలకంగా మారనుంది.

ALSO READ: Tata Tiago EV: జనాల మనసు దోచుకోనున్న టాటా.. బండి చిన్నదే కానీ.. లోపల టెక్నాలజీ పెద్దది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments