Telangana: తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థకు కీలకమైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె దిశగా అడుగులు వేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు హెచ్చరిక జారీ చేయడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తమ డిమాండ్లపై చర్చలు జరిపి, అధికారుల స్పందనను బట్టి సమ్మెపై తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో లేబర్ కార్యాలయం వద్దకు తరలివచ్చి ఐక్యంగా తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చాయి. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె తప్పదని స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. వేతనాల పెంపు, సౌకర్యాల మెరుగుదల, సేవా నియమావళిలో మార్పులు వంటి కీలక అంశాలపై గత కొంతకాలంగా కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ సరైన స్పందన లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 13ననే సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మికుల్లో అసంతృప్తి మరింత పెరిగింది. ఇప్పుడు మరోసారి నోటీసు ఇచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఈసారి కూడా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగడం తప్పదని, ఆ పరిస్థితులకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని జేఏసీ నేతలు పేర్కొన్నారు. తమ హక్కుల కోసం వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇక ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రోజువారీగా లక్షలాది మంది ఆధారపడే బస్సు సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడితే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య చర్చలు ఎలా సాగుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె హెచ్చరికపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయా లేక సమ్మె దిశగా పరిస్థితులు వెళ్తాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
ALSO READ: మండిపోతున్న ఎండలు.. ఏపీలో 11 గంటలవరకే హాఫ్ డే స్కూల్స్
