
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలంగాణ నేతల సిఫార్సుల వివాదం మరోసారి భగ్గుమంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించడలేదు. దీంతో వివాదం ముదిరింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సమస్య ఉంది. అయితే… గత డిసెంబర్‌లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారు. దీంతో.. ఫిబ్రవరి నుంచి లేఖలు స్వీకరిస్తామని టీటీడీ ప్రకటించింది. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సంబంధించి వారానికి నాలుగు సిఫారసు లేఖలను మాత్రమే అనుమతిస్తామని ప్రకటించారు. వారానికి రెండుసార్లు 300 రూపాయల దర్శనం, రెండు సార్లు బ్రేక్ దర్శనానికి లేఖలు తీసుకుంటామని చెప్పారు. అప్పటితో ఆ సమస్యకు చెక్ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ.. గత కొద్ది రోజులు ఈ వివాదం మరింత రాజుకుంది.
తెలంగాణకు చెందిన మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు శుక్రవారం (మార్చి 14) తిరుమల శ్రీవారికి దర్శనానికి వెళ్లారు. దర్శనం తర్వాత… టీటీడీ తీరుపై మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు అమలు కావడంలేదని విమర్శించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు తీసుకుంటామని చెప్పారని… కానీ, ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. మార్చి నెల సగం అయిపోయినా… తమ సిఫారసు లేఖలు తీసుకోవడంలేదన్నారు. వేసవి సెలవుల సమయంలో సిఫారసు లేఖలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే… తెలంగాణ ప్రజాప్రతినిధులం అంతా ఒకేసారి తిరుమల వస్తామని.. అప్పుడు టీటీడీ ఏం చేస్తుందో చూస్తామని హెచ్చరించారాయన.
శుక్రవారం (మార్చి 14) తిరుమల దర్శనానికి వెళ్లిన తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిబంధనలే తిరుమలలో ఉండాలన్నారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని చెప్పారాయన. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకునే టీటీడీ చర్యలు చేపట్టాలన్నారు.
ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడా ఈ విషయంపై స్పందించారు. చంద్రబాబుకు లేఖ కూడా రాశామని చెప్పారు. అయినా… తెలంగాణ నేతల సిఫారసు లేఖల్ని టీటీడీ పరిగణలోకి తీసుకోవడంలేదని ఆరోపించారు. తెలంగాణ నేతలు వస్తే.. వారికి ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తున్నారే తప్ప.. వారు ఇచ్చే సిఫారసు లేఖలను తీసుకోవడంలేదు. దీంతో నాయకులతోపాటు తిరుమల వెళ్లే అనుచరులు ఇబ్బంది పడుతున్నారు.