బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీయే కూటమి సంచలన విజయాన్ని అందుకుంది. ఏకంగా 200 పైగా స్థానాలను దక్కించుకుని మరోసారి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. అటు ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన విపక్ష పార్టీలు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం అని చెప్పుకొచ్చారు.
ఓడినా ప్రజల్లోనే ఉంటాం: తేజస్వీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రీయ జనతా దళ్ (RJD) స్పందించింది. ప్రజాక్షేత్రంలో ఒడిదుడుకులు సహజం అని చెప్పుకొచ్చింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, పేదల మధ్యే ఉంటే వారి వాణి వినిపిస్తూనే ఉంటుందని వెల్లడించింది. “ప్రజా సేవ ఒక నిరంతర ప్రక్రియ. అందులో ఎత్తుపల్లాలు సహజం. ఓడిపోయినందుకు విచారం, గెలిచినందుకు అహంకారం ఉండదు” అని ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్ చెప్పుకొచ్చారు.
పార్టీకీ లాలూ కుమార్తె గుడ్ బై
ఎన్నికల్లో పరాజయం పొందిన మరుసటి రోజే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అటు తన కుటుంబంతోనూ సంబంధాలను కూడా తెంచుకుంటున్నట్టు వెల్లడించారు. “నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. నా కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ అడిగింది కూడా ఇదే. నేను ఈ నిందనంతా స్వీకరిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
ప్రశాంత్ కిశోర్ ఏమన్నారంటే?
బీహార్ ఓటమిపై ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్ బంధన్ అధికారంలోకి వస్తే, జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందనే భయంతో తమ పార్టీ ఓటర్లు కొందరు ఎన్డీయే పక్షాల అభ్యర్థులకు ఓటు వేశారని వివరించారు. జంగిల్ రాజ్ ఉందని తాను చెప్పలేనన్న ప్రశాంత్ కిశోర్..తమ పార్టీ ఓటర్లు మాత్రం ఆ భయం వల్లే ఎన్డీయేకు ఓటేశార న్నారు. కాంగ్రెస్‌తోగానీ, మహాగఠ్ బంధన్‌లోని ఏ ఇతర పార్టీతోనూ లేని ఇబ్బంది ఆర్జేడీతో ఉన్నట్లుగా ప్రజలు భావించారని తెలిపారు. ముస్లిం వర్గం తమను ఇంకా పూర్తిగా నమ్మలే దంటూ ఆయన..దీర్ఘకాలంలో వారి మద్దతుల భిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.





