దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో చివరిరోజు ఘోర ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజ్‌స-ఎమ్‌కే1 కూలిపోయింది. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిన తేజస్, నింగిలో విన్యాసాలు చేస్తుండగానే నేరుగా కిందికి జారింది. నేలను బలంగా తాకి పేలిపోయింది. ఈ ఘటనలో పైలట్ తీవ్రగాయాలతో మృతిచెందినట్లు భారత వాయుసేన ప్రకటించింది. పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపింది.
తేజస్ కూలడం ఇది రెండోసారి!
హాల్ అభివృద్ధి చేసిన ఈ సింగిల్ సీటర్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నెగెటివ్ జీ ఫోర్స్ టర్న్ నుంచి యుద్ధవిమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో పైలట్ విఫలమవ్వడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఈ ఘటన జరిగింది. 2001 జనవరి 4న తేజస్ మొదటిసారి గాల్లోకి లేచాక కూలిపోవడం ఇది రెండోసారి. త్రివిద దళాల ఆధ్వర్యంలో శిక్షణా విన్యాసాలు నిర్వహిస్తుండగా అప్పట్లో పోఖ్రాన్‌కు 100 కి.మీ దూరంలోని రాజస్థాన్ జైసెల్మేర్‌లోని జనావాసాల సమీపంలో తేజస్ కూలిపోయింది. పారాచూట్ ద్వారా బయటపడటంతో పైలట్ ప్రాణాలు దక్కాయి.
తేజస్ కూలడానికి కారణాలు ఏంటి?
ఎయిర్ షో విన్యాసాల్లో భాగంగా తేజస్ పైలట్ ‘బారెల్ రోల్’ అనే విన్యాసాన్ని ప్రదర్శిస్తుండగా ప్రమాదం సంభవించింది. బారెల్ రోల్ లో భాగంగా విమానం గాల్లోనే నిలువుగా 360 డిగ్రీలు తిరగాల్సి ఉంటుంది. ఇలా గిరగిరా తిరగడం సంక్లిష్టమైన ప్రక్రియ కానప్పటికీ ఈ విన్యాసంలో పైలట్ క్షణకాలం తలకిందులుగా ఉంటాడు. తాజా ఎయిర్ షోలో భాగంగా పైలట్.. ఈ కచ్చితమైన లూప్ నకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మొదట పైకి ఎగసి.. తర్వాత తలకిందులుగా వెళ్లి.. మళ్లీ పైకి ఎగిసే క్రమంలో ప్రమాదం సంభవించింది. విమానాన్ని మళ్లీ పైకి లేపే క్రమంలో వేగం సరిపోకపోవడంతోనే కూలిపోయి ఉండొచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే అసలు వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.





