
Teenage Changes: టీనేజ్ అనేది జీవితంలో అత్యంత రంగులున్న, ఉత్సాహంతో నిండిపోయిన, ఎంతో ముఖ్యమైన దశ. ఈ సమయంలో భావోద్వేగాలు తీవ్రంగా మారుతుంటాయి. శరీరంలో జరిగే మార్పులు, మనసులో వచ్చే కొత్త అనుభూతులు అన్నీ కలగలిపి ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని సృష్టిస్తాయి. అయితే ఇదే వయసులో కొందరు అమ్మాయిలకు అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిలో ప్రధానంగా చర్చించేది మూతిపై మీసాల పెరుగుదల.
బాలురకు సహజమైన ఈ లక్షణం బాలికల్లో కనిపించడం వల్ల వారు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇతరుల ఎగతాళి, స్నేహితుల వద్ద తగ్గుతున్న ఆత్మ విశ్వాసం, సెల్ఫీలు తీసుకోవడంపై భయం, అబ్బాయిలకు తాము నచ్చరనే భావన ఇలాంటి అనేక మానసిక ఒత్తిడులు బాలికలను బాధిస్తున్నాయి. ఈ సమస్య కొన్నేళ్ల క్రితం చాలా అరుదుగా కనిపించేది. అప్పట్లో 10 మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఈ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 10 మందిలో ఆరుగురి వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి మీసాల పెరుగుదలకు హార్మోన్ల అసమతుల్యతే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం ఇవన్నీ అమ్మాయిల హార్మోన్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. స్కూల్ వయసు పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం, నిరంతరం జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం, చక్కెరలతో నిండిన పానీయాలు ఎక్కువగా తాగడం, గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం వంటి కారణాలు ఎండోక్రైన్ సిస్టమ్‌ను దెబ్బతీస్తున్నాయి. దీని ప్రభావంగా టెస్టోస్టెరాన్ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. ఫలితంగా ముఖం, మెడ, చేతులపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయి. ఇది ప్రస్తుతం అమెరికా, యూరప్, భారత్, చైనా వంటి అనేక దేశాల్లో పెద్ద సమస్యగా మారింది. అయితే ఇది శరీరంలో జరుగే సహజ మార్పులలో భాగమేనని, దీన్ని పెద్దగా ఆందోళనగా పరిగణించాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
మీసాల పెరుగుదల వల్ల బాలికలు భావోద్వేగపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో తోటి విద్యార్థులు చేసే కామెంట్లు, బయట జరిగే అవహేళనలు, ఇంట్లో చెప్పుకోలేని సంకోచం ఇవి అన్నీ కలిసి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తున్నాయి. కొందరిలో ఇది మానసిక ఒత్తిడి పెరగడానికి, ఆత్మగౌరవం దెబ్బతినడానికి కూడా దారితీస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆధునిక జీవనశైలిలో అధిక కార్బోహైడ్రేట్లున్న ఆహారం, ఎక్కువ స్క్రీన్ టైమ్, తక్కువ వ్యాయామం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వంటివి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచి తిరిగి ఆండ్రోజెన్ హార్మోన్లను అధికం చేసే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఇవి కొనసాగితే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి సమస్యలు వచ్చే అవకాశమూ ఉంది.
అయితే, ఈ సమస్యను తగ్గించుకోవడం అసాధ్యం కాదు. రోజూ కనీసం 30 నిమిషాలు వేగంగా నడక, యోగా, ఆటలు వంటి ఫిజికల్ యాక్టివిటీ చేయడం హార్మోన్ల పనితీరును సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫాస్ట్‌ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తగ్గించి, ఇంట్లో తయారు చేసే తాజా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గించి వెంట్రుకల పెరుగుదల తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాక, అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స, మార్గదర్శకాలు తీసుకోవడం మంచిది. వారు చర్మానికి, హార్మోన్లకు సంబంధించిన పరీక్షలు చేసి, సరైన చికిత్సను సూచించగలరు. ఈ చిన్న అలవాట్లతో పెద్ద మానసిక ఒత్తిడి నుంచి బాలికలు బయటపడవచ్చు.





