Monday, February 16, 2026
Homeఅంతర్జాతీయంఏపీలో టెక్ పాలన గ్రేట్

ఏపీలో టెక్ పాలన గ్రేట్

  • బిల్ గేట్స్
  • ప్రజల జీవితాల్లో ఆర్టీజీఎస్ మార్పు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, క్రైమ్ మిర్ర‌ర్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సందర్శించారు.

ఈ సంద‌ర్భంగా డిస్ ప్లే వాల్స్‌పై ప్రదర్శించిన ప్రజంటేషన్లను తిలకించారు. ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని ఆసాంతం పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

ముందుగా రాష్ట్రంలోని డేటా లేక్ వ్యవస్థ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలనూ అనుసంధానించామని తద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని తెలిపారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు, అమరావతి రాజధాని అంశాలపై అధికారులు బిల్ గేట్స్‌కు డిస్ ప్లే వాల్స్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చారు.

అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి దానిని ప్రజలకు వేగంగా అందిస్తున్నట్టు తెలియచేశారు. 42 రకాల సమాచారాన్ని ప్రజలకు, రైతులకు అందించటం ద్వారా తక్షణం స్పందించేందుకు ఆస్కారం కలుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు.

అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవల్ని కూడా సులభతరం చేశామని ప్ర‌జ‌ల‌ చేతుల్లోకి 921 సేవలను తీసుకెళ్లామని సీఎం వివరించారు. వీటిని ఆసక్తిగా పరిశీలించిన బిల్ గేట్స్ పౌరసేవలను సులభతరం చేయటం బాగుందని కితాబిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్న తీరును తెలుసుకున్నారు. రాష్ట్రంలో జీఎస్డీపీ పెరుగుదలను కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి వివరించారు.

ఏపీలోని ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రిని గేట్స్ అడిగారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులను భద్రపరుస్తున్నామని వివరించారు. భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేసి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ప్రభుత్వ డాక్యుమెంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏపీ ఏఐ సెర్చ్ బార్ ను అందుబాటులోకి తెచ్చామని అధికారులు గేట్స్‌కు ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిని పరిశీలించిన బిల్ గేట్స్ పన్నుల వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికారులు, నాయ‌కులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments